Miriyala Rasam : భారతీయులు చాలా కాలం నుండి వంటల్లో వాడుతున్న మసాలా దినుసులల్లో మిరియాలు ఒకటి. వీటి వల్ల వంటకు రుచి రావడమే కాకుండా అనేక ఆరోగ్యకరమైన ప్రయోనాలు కూడా కలుగుతాయి. ఆయుర్వేద వైద్యులు అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో మిరియాలను వాడుతుంటారు. సాధారణ జలుబు, దగ్గులను తగ్గించడంలో మిరియాలతో చేసిన కషాయం ఎంతగానో సహాయపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
మిరియాలల్లో ఉండే పొటాషియం హైబీపీని నియంత్రిస్తుంది. మిరియాలను పసుపుతో కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ , అజీర్తి సమస్యలను తగ్గించడంలో కూడా మిరియాలను వాడవచ్చు. వంటల్లో, సలాడ్స్ వంటి వాటిపై మిరియాలను పొడిలా చేసి వాడవచ్చు. మనలో చాలా మందికి సాధారణ జలుబు, దగ్గు వంటివి వచ్చినప్పుడు నోటికి రుచిగా, ఘాటుగా , వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటి వారు మిరియాలతో రసాన్ని చేసుకుని అన్నంతో కలిపి తినడం వల్ల రుచితోపాటు జలుబు, దగ్గు నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ రసాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మిరియాలతో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల రసానికి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒకటిన్నర లీటర్, నల్ల మిరియాలు – ఒకటిన్నర టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి – 5 రెబ్బలు, చింతపండు – 30 గ్రా., పసుపు – అర టీ స్పూన్, ఉప్పు -తగినంత, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు వేయడానికి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – ఒక టీ స్పూన్.
మిరియాల రసం తయారు చేసే విధానం..
ముందుగా ఒక జార్ తీసుకొని అందులో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా రవ్వ రూపంలో ఉండేలా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో పసుపు, చింత పండు, కరివేపాకు, కొత్తి మీర, ముందుగా చేసిపెట్టుకున్న పొడిని వేసి 15 – 20 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. తరువాత ఒక చిన్న కడాయి తీసుకుని నూనె వేసి, కాగాక పైన చెప్పిన తాళింపు పదార్థాలు అన్నింటినీ వేయాలి. ఇవి వేగాక ముందుగా చేసిపెట్టుకున్న రసంలో వేసి వెంటనే మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల చక్కటి వాసనతో రుచిగా, ఘాటుగా ఉండే మిరియాల రసం తయారవుతుంది. ఈ రసాన్ని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గుల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో బ్యాక్టీరియాల వచ్చే ఇన్ ఫెక్షన్ లను కూడా మిరియాలు తగ్గిస్తాయి. చర్మ సంబంధమైన సమస్యలను తగ్గించడంలో మిరియాలు ఎంతో సహాయపడతాయి. మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.