Kashayam : మనకు సాధారణ జలుబు, దగ్గు కాలంలో మార్పుల కారణంగా వస్తుంటాయి. పెద్దలలో సంవత్సరానికి రెండు నుండి మూడు సార్లు సాధారణ జలుబు, దగ్గు వస్తుంటాయి. పిల్లలలో వీటిని మనం తరుచూ చూడవచ్చు. వైరల్ ఇన్ ఫెక్షన్స్, ఊపిరితిత్తులల్లో కఫం, శ్లేష్మం పేరుకు పోయినప్పుడు సాధారణ జలుబు, దగ్గు వస్తుంటాయి. ముక్కు పట్టేసినట్టు ఉండడం, తరచూ తుమ్ములు రావడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, సాధారణ జలుబు, దగ్గులకు చెందిన లక్షణాలు. వీటి నుండి బయట పడడానికి మనం రకరకాల యాంటీ బయాటిక్స్, దగ్గు సిరప్ లను వాడుతూ ఉంటాం. కానీ సాధారణ జలుబు, దగ్గుకు ఎటువంటి మందులు అవసరం లేదు. మందులు వాడినా వాడకపోయినా అవి తగ్గడానికి వారం నుండి పది రోజుల సమయం పడుతుంది. వీటిని తగ్గించడానికి మందులను వాడడం కంటే సహజ సిద్దంగా మనం వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసులను వాడడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

పిల్లలకు మందులను, సిరప్ లను వాడడం కంటే మసాలా దినుసులను ఉపయోగించి చేసిన కషాయాన్ని తాగించడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జలుబు, దగ్గు తగ్గడానికి తరచూ గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గడంతోపాటు కఫం పలుచబడి ఉపశమనం కలుగుతుంది.
మసాలా దినుసులను ఉపయోగించి చేసే కషాయం కూడా సాధారణ జలుబు, దగ్గులను నివారించడంలో సహాయపడుతుంది. ఈ కషాయాన్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.
ఒక గ్లాసు నీటిలో కొన్ని మిరియాలు, కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా పసుపు, కొన్ని తులసి ఆకులు వేసి అర గ్లాసు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడ కట్టి కొద్దిగా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయం మనం వాడే మందుల కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. పిల్లలకు ఈ కషాయంలో కొద్దిగా ఎక్కువ తేనె కలిపి ఇవ్వడం వల్ల ఘాటు తగ్గి సులువుగా తాగగలుగుతారు. ఈ మసాలా దినుసులల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు తగ్గడంలో సహాయపడతాయి. ఈ కషాయం తాగడం వల్ల సాధారణ జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.