Mysore Bonda : మైసూర్ బొండాల‌ను ఇలా చేస్తే.. ఒక‌టి ఎక్కువే తింటారు..

Mysore Bonda : మ‌న‌కు ఉద‌యం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో మైసూర్ బోండా కూడా ఒక‌టి. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటూ ఉంటారు. ప‌ల్లి చ‌ట్నీ, సాంబార్ తో క‌లిపి తింటే మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు హోటల్స్ లో కూడా ల‌భ్య‌మ‌వుతాయి. హోట‌ల్స్ ల‌భించే బోండాలు చ‌క్క‌గా పొంగి పైన క‌ర‌క‌ర‌లాడుతూ, రుచిగా ఉంటాయి. ఇలా హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే మైసూర్ బోండాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌గా, రుచిగా, పైన క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా మైపూర్ బోండాల‌ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ మైసూర్ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – రెండు క‌ప్పులు, బియ్యం పిండి – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, పెరుగు – ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Mysore Bonda recipe in telugu make in this way
Mysore Bonda

హోట‌ల్ స్టైల్ మైసూర్ బోండా తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో బియ్యం పిండి, ఉప్పు, జీల‌క‌ర్ర‌, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగులో త‌గిన‌న్ని నీళ్లు పోసి మ‌జ్జిగ‌లా చేసుకోవాలి. ఈ మ‌జ్జిగ‌ను కొద్ది కొద్దిగా మైదాపిండిలో వేసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి. ఈ పిండి మ‌రీ ప‌లుచ‌గా, మ‌రీ గ‌ట్టిగా ఉండ‌కుండా చేసుకోవాలి. త‌రువాత ఈ పిండిపైమూత పెట్టి ఒక గంట పాటు నాననివ్వాలి. త‌రువాత లోతేగా ఉండే క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చేతికి త‌డి చేసుకుంటూ పిండిని ఒక ప‌క్క నుండి తీసుకుని నూనెలో బోండాలాగా వేసుకోవాలి. ఇలా నూనెకు త‌గిన‌న్ని బోండాల‌ను వేసుకున్న త‌రువాత వాటిని వెంట‌నే క‌దిలించ‌కూడ‌దు.

అవి కొద్దిగా కాలిన తరువాత వాటిని గంటెతో అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రుచిగా, చ‌క్క‌గా హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే బోండాలు త‌యార‌వుతాయి. వీటిని ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉద‌యం పూట అల్పాహారంగా ఇలా అప్పుడ‌ప్పుడూ బోండాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన బోండాల‌ను అంద‌రూ ఇష్టంగా ఒక‌టి ఎక్కువ‌గానే తింటారు.

Share
D

Recent Posts