Street Style Aloo Chips : బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఆలూ చిప్స్ కూడా ఒకటి. ఆలూ చిప్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరింత ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. సాధారణంగా ఈ చిప్స్ ను మనం బయట నుండి కొనుగోలు చేసి తీసుకుంటూ ఉంటాము. కానీ బయట కొనే పనిలేకుండా పొటాటో చిప్స్ ను అదే రుచితో అంతే క్రిస్పీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.కింద చెప్పిన విధంగా చేయడం వల్ల ఇంట్లోనే క్రిస్పీగా, రుచిగా ఉండే పొటాటో చిప్స్ ను తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. బయట లభించే విధంగా క్రిస్పీగా, రుచిగా ఉండే బంగాళాదుంప చిప్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్త బంగాళాదుంపలు – 3, చల్లటి నీళ్లు – 3 గ్లాసులు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ చిప్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడగాలి. తరువాత గిన్నెలో చల్లటి నీటిని తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి చల్లటి నీటిలో వేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లను తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత బంగాళాదుంపలను చల్లటి నీటి నుండి తీసి తడి లేకుండా తుడుచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్లైసర్ ను తీసుకుని నేరుగా నూనెలోనే బంగాళాదుంపను చిప్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ కదుపుతూ వేయించాలి. చిప్స్ 70 శాతం వేగిన తరువాత ముందుగా కలుపుకున్న ఉప్పు నీటిని అర టీ స్పూన్ మోతాదులో నూనెలో వేగుతున్న చిప్స్ పై వేసుకోవాలి. తరువాత వీటిని పూర్తిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. చిప్స్ వేగగానే నూనెలో బుడగలు రావడం తగ్గుతుంది. ఇలా చిప్స్ వేగగానే ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా పైన కారం పొడిని, చాట్ మసాలాను చల్లుకుని కూడా తినవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే చాలా సులభంగా ఆలూ చిప్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు.