ఆబ్బో ఇంతోటి పెసరట్లకి పెట్టిపుట్టాలా ఏం మేము చేసుకునేవి పెసరట్లు కావా అంటే అవి మీరు చేసుకునేవి ఇవి కాకినాడవి. బోల్డంత తేడా ఉంది. మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేస్తారా? వెయ్యరు. మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేసి ఆపైన పచ్చి పెసరపప్పుని కూడ వేస్తారా? వెయ్యరు! ఇవన్నీ కాదు, పెసరట్టు మీద బాగా నెయ్యి వెయ్యడానికి ఇష్టపడాతారా? అదీ లేదు! అలాంటప్పుడు మీ పెసరట్టుకి కాకినాడ పెసరట్టుకి తేడా ఉంది తినాలంటే పెట్టిపుట్టాలనే మాట ఒప్పుకోవాలి కదా. ఆరోగ్యం కోసం ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉంటున్న జనం ఇంక నెయ్యి అంటే ఒప్పుకుంటారా..? కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం కోరికని కంట్రోల్ చేసుకోవడం తప్పదనే రోజుల్లో బతికేసేవాళ్ళం ఇవి తింటే ఎలాగా అంటే అదీ నిజమే. అందుకే తినడానికి కూడా రాసిపెట్టి ఉండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు.
ఇంత స్పెషల్ గా ఉండే కాకినాడ పెసరట్ల లో ఏవుందీ అంటే, బుల్లి బుల్లి పెసరట్లని వేసి చుట్టూ బాగా నెయ్యి వేసి అట్లపైన కొద్దిగా ఎండుమిర్చి కారం చల్లి ఆపైన కొద్దిగా (నీటిలో నానపెట్టిన) పచ్చి పెసరపప్పుని కూడా వేస్తూ ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చిముక్కలు,అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసి అప్పుడు ఉప్మా వేసి అల్లం చెట్నీ, కొబ్బరి చెట్నీ, బొంబాయి చెట్నీతో అందిస్తారు. పెసరట్లంటే ఏదో పెసరపప్పుతో చేస్తారనుకునేరు, కాదు పెసలు తీసుకుని నాలుగు గంటలు నీటిలో నానపెట్టి గ్రైండ్ చేసిన పెసరపిండిని ఈ అట్లకి వాడతారు. ఇంత కధ ఉంది ఈ చిన్న చిన్న పెసరట్లకి. కాకినాడ లో బాలాజీ చెరువు దగ్గర జగన్నాధపురం బ్రిడ్జీ దాటి కొంచెం ముందుకెళితే కనిపించే శివాలయం వీధిలో ఇలా చాలా చోట్ల ఈ రకం పెసరట్లని చూడచ్చు .
ఎందుకింత పేరు వీటికి అంటే మామూలుగా అన్ని చోట్ల చేసే పెసరట్ల సైజులో ఉండవు ఇవి, ఒక మామూలు ఇడ్లీ సైజుల్లో ఉంటాయి అంతే. అసలు పెసరట్టు ఎలా పుట్టిందో చెప్పడానికి ఒక చిన్న కధ చెప్తారు మన పెద్దవాళ్ళు. పూర్వం గరుత్మంతుడు తల్లి కోసం అమృత భాండం నోట కరుచుకుని వాయు మార్గంలో వెళుతూ వుంటే ఆ అమృత భాండంలోని అమృతం భూమి మీద ఒలికితే ఆ చుక్కలలోంచి పెసరమొక్క మొలిచిందని చెప్తారు. అలా తెలుగువారికే సొంతమైన పెసరట్టు పుట్టింది. ఊరికే పెసరట్టుని మాత్రమే తింటే కాదు ఉప్మాతో చెట్నీలతో తింటేనే పెసరట్టు రుచి తెలిసేది.. పెసరట్టు తెలుగువారి అమృతం.