ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు కధ, నవల లోని సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు. ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నిజంగా జీవించారనే చెప్పాలి. లక్ష్మీపతి పాత్రను తొలుత రావుగోపాలరావు చేత వేయించాలనుకున్నారు. లుక్ పరంగానూ, నేటివిటీ పరంగానూ ఆయన కరక్ట్ కాదేమోనని ఎవరో సందేహం వెలిబుచ్చటంతో జంధ్యాల కోటను ఎన్నుకున్నారు. అప్పటికి కోట సినిమా ఫీల్డ్ కొచ్చి రెండేళ్ళు అవుతోంది. సినిమాల్లోకొచ్చేముందు కోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం చేస్తూ తీరిక దొరికినప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. జంధ్యాల అమరజీవి సినిమా చేస్తున్నప్పుడు సరదాగా కోటతో ఓ వేషం వేయించారు. అక్కినేని ఇంటి ఓనర్ పాత్రలో కనిపిస్తారాయన. కోటకి నటునిగా తొలి చిత్రం ప్రాణం ఖరీదు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో అమరజీవి లో నటించారు. తర్వాత బాబాయ్ అబ్బాయ్ లో కూడా ఓ పాత్ర పోషించారు.
కోట కి ఎయిర్‌పోర్ట్ లో కనపడ్డ రామానాయుడు ఆహా నా పెళ్ళంట లో జంధ్యాల గారు నీతో పెద్ద వేషం వేయించాలనుకుంటున్నారు అని చెప్పడంతో తెగ ఆనందపడిపోయారు. పాత్రకోసం చిన్న క్రాఫ్ చేయించుకోవాలి, అప్పటికి వేరే సినిమాల్లో బిజీ గా ఉండడంవల్ల ఈ క్రాఫ్ సమస్య అవుతుందని కోటా కొంచం డైలమాలో పడ్డారు. తర్వాత ఆయా దర్శకుల దగ్గరికి వెళ్ళి విగ్గు పెట్టుకుంటానని ఒప్పించారు. ముతకపంచె, బనీను, పగిలిన కళ్ళద్దాలతో కోట ఈ సినిమాలో కనిపిస్తారు. ఈ గెటప్ ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. ఈ గెటప్ లో కొంచం రఫ్ గా కనపడాలనే ఉద్దేశ్యంతో మట్టిలో దొర్లించారు. ఇందులో మొదట మామూలు కళ్ళద్దాలే అనుకున్నారు, షూటింగ్ స్పాట్ కి వచ్చాక పగిలిన కళ్ళజోడు ఉంటే బావుంటుందని భావించిన జంధ్యాల ఆ కళ్ళజోడుని తనే చిన్న రాయి పెట్టి పగలగొట్టారు. 20 రోజుల పాటు ఆ పగిలిన కళ్ళజోడుతోనే నటించారు కోట. చాలామంది పగిలిన కళ్ళజోడు పెట్టుకోడం కష్టం కదా అని అడిగారు, ఆ వేషం మీద ఉన్న మోజులో ఏ కష్టమూ తెలియలేదని చెప్పారు కోట.
షూటింగ్ జరుగుతుండగా కోటతో నీ వేషం కనుక సక్సెస్ అయితే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనేవారుట రామానాయుడు. ఈ పాత్ర మీద కోటకు ఎనలేని మక్కువ ఉంది. ఒక సామెత లాగ మిగిలిపోయిన పాత్ర ఇది. గయ్యాళి అనగానే సూర్యకాంతం గుర్తొచ్చినట్టుగానే, పిసినారి అనగానే అహ నా పెళ్ళంట సినిమాలో పాత్ర గుర్తొస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక చోట పిసినారితనానికి పరాకాష్ట ఇది అని అంటాడు. నిజంగా అలాటి పాత్రే ఇది, పిసినారి పాత్రలు ఎన్ని వచ్చినా ఈ పాత్రదే అగ్రస్థానం అంటారు కోట శ్రీనివాసరావు. ఈ సినిమాలో పిసినారితనాన్ని న భూతో న భవిష్యతి అన్న రీతిలో తెరకెక్కించిన జంధ్యాల తన బలం, జీవం, ప్రాణమైన హాస్యరసంలో మాత్రం పిసినారితనం చూపకుండా ధారాళంగా నవ్వులను పంచిపెట్టారు. కాకపోతే ఆ నవ్వుల మీద వడ్డీ హక్కులన్నింటినీ తెలుగు ప్రేక్షకులకే వదిలేసారు… శాశ్వతంగా…