Covid Vaccine 3rd Dose : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో బూస్టర్ డోసును ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఫ్రంట్ లైన్, హెల్త్ వర్కర్లతోపాటు 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోస్‌ను ఇవ్వనున్నారు. జనవరి 10వ తేదీ నుంచి వారికి మూడో డోసు ఇస్తారు. అయితే రెండో డోసు తీసుకున్న తరువాత 9 నెలలు పూర్తయిన వారికే ఆ విధంగా మూడో డోసును ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
2021 ఏప్రిల్ 10.. అంతకు ముందు రెండు డోసుల టీకాలను తీసుకున్నవారికి ప్రస్తుతం మూడో డోసును ఇవ్వనున్నారు. వారికి ఆ మేరకు ఎస్ఎంఎస్‌లను పంపించనున్నారు. ఇక 15-18 ఏళ్ల వయస్సు వారికి జనవరి 3వ తేదీ నుంచి కోవాగ్జిన్ టీకాను ఇవ్వనున్నారు. ఇందుకుగాను జనవరి 1వ తేదీ నుంచి వారు కోవిన్ పోర్టల్‌లో ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇక 15-18 ఏళ్ల వయస్సు వారికి ప్రస్తుతం కేవలం ఒకే వ్యాక్సిన్.. కోవాగ్జిన్‌ను మాత్రమే ఇస్తారు. జైడస్ హెల్త్‌కేర్‌కు చెందిన జైకోవ్-డి వ్యాక్సిన్‌ను కూడా ఈ వయస్సు వారికి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ దానికి ఇంకా ఆమోదం తెలపలేదు. అయితే 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్నవారు విద్యార్థులు అయితే తమ స్టూడెంట్ ఐడీ కార్డులతోనూ వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.