కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న తరుణంలో యూకే, సౌతాఫ్రికాల్లో బయట పడ్డ కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూకేలో కెంట్ (బి.1.1.7) పేరిట, సౌతాఫ్రికాలో బి.1.351 పేరిట కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు బయట పడ్డాయి. ఇవి ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.
కొత్త కోవిడ్ స్ట్రెయిన్లకు చెందిన మరింత సమాచారాన్ని ప్రస్తుతం సైంటిస్టులు తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ వైరస్ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, వ్యాక్సిన్ల వల్ల కలిగే యాంటీ బాడీలను సైతం దాటుకుని అవి వ్యాప్తి చెందుతున్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఈ క్రమంలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ల ప్రభావం ప్రజలపై ఎంత వరకు ఉంటుందని సైంటిస్టులు ఇప్పటికే పలు అధ్యయనాల ద్వారా అంచనా వేశారు.
యూకేకు చెందిన కోవిడ్ స్ట్రెయిన్ వల్ల బాధితులు చనిపోయే అవకాశాలు 33 శాతం వరకు పెరిగినట్లు సైంటిస్టులు గుర్తించారు. లండన్‌లో నవంబర్ 2020 నుంచి జనవరి 2021ల మధ్య 8.50 లక్షల మంది పాజిటివ్ పేషెంట్లకు చెందిన డేటాను పరిశీలించిన అనంతరం సైంటిస్టులు పైన తెలిపిన వివరాలను వెల్లడించారు.
ఇక కొత్త కోవిడ్ స్ట్రెయిన్ బారిన పడితే 70-84 మధ్య వయస్సు ఉన్న పురుషులకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని, వారు చనిపోయే అవకాశాలు 5 శాతం పెరుగుతాయని సైంటిస్టులు తెలిపారు. 85 ఏళ్లకు పైబడిన వారికి అయితే చనిపోయే రిస్క్ 7 శాతం వరకు ఉంటుందని తేల్చారు. ఇక కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు ఫలానా వారికి అని కాకుండా.. అందరికీ వేగంగానే వ్యాప్తి చెందుతాయని, కానీ 20 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వారికి కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, వారికి మరింత హాని కలిగిస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే సైంటిస్టులు కొత్త కోవిడ్ స్ట్రెయిన్లపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.