కరోనా వల్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే కోవిడ్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారం అందించనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఓ నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఏపీలో కోవిడ్ బాధిత కుటుంబాలకు సత్వరమే పరిహారం అందేలా చేసేందుకుగాను ఏపీ ప్రభుత్వం కొత్తగా https://covid19.ap.gov.in/exgratia అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని కంప్యూటర్ లేదా ఫోన్‌లో ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ను కూడా జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
పైన తెలిపిన వెబ్‌సైట్‌ను కంప్యూటర్ లేదా ఫోన్‌లో ఓపెన్ చేయవచ్చు. అందులో నష్టపరిహారం కోసం దరఖాస్తు చేయవచ్చు. అయితే బాధితులు కోవిడ్ తో చనిపోయిన వ్యక్తికి చెందిన ఆర్‌టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటీ జెన్ లేదా మాలిక్యులర్ టెస్టులలో ఏదో ఒక డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో వెరిఫికేషన్ అనంతరం సదరు నష్టపరిహారం నేరుగా బాధితుల ఖాతాల్లో జమ అవుతుంది.
ఇక తెలంగాణలో ఇప్పటికే మీ-సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్కడ కూడా పైన తెలిపిన విధంగా పత్రాలను అందజేసి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేయవచ్చు.