Omicron : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజల్లో ఒమిక్రాన్ భయం నెలకొంది. బ్రిటన్, సౌతాఫ్రికాలలో ఇప్పటికే రోజూ భారీ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండడం ఆందోళనను కలిగిస్తోంది. దీంతో ప్రజలు కొత్త కరోనా వేరియెంట్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్‌లను ధరించే విషయంలో అనేక జాగ్రత్తలను పాటించాలని అంటున్నారు. గతంలో సింగిల్ లేయర్ మాస్క్‌ను ధరించినా వైరస్ నుంచి రక్షణ లభించింది. కానీ ఇప్పుడు సింగిల్ లేయర్ మాస్క్‌లు పనికి రావని నిపుణులు అంటున్నారు. అందువల్ల మాస్క్‌లను ధరించే విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాలని అంటున్నారు.
కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అమెరికా సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు మాస్కుల విషయంలో పలు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ప్రజలు ఇప్పటి వరకు ధరించిన సింగిల్ లేయర్ మాస్క్‌లను ఇకపై రెండు చొప్పున ధరించాలని అంటున్నారు.
ప్రజలు ఇప్పటి వరకు సర్జికల్ లేదా క్లాత్ మాస్కులను ఒకటి మాత్రమే ధరించారు. కానీ ఒమిక్రాన్ గత వేరియెంట్‌ల కన్నా మరిన్ని రెట్ల వేగంతో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కనుక ఇన్‌ఫెక్షన్ రిస్క్ మరింత పెరిగింది. అందువల్ల సింగిల్ లేయర్ మాస్క్ సరిపోదు. ప్రజలు క్లాత్ లేదా సర్జికల్ మాస్క్‌లను ధరించాల్సి వస్తే.. వాటిని రెండు చొప్పున.. డబుల్ మాస్క్‌లా ధరించాలని అంటున్నారు.
ఇక డబుల్ మాస్క్‌లను ధరించలేకపోతే ఎన్95 మాస్క్ ఒకదాన్ని కచ్చితంగా ధరించాలని అంటున్నారు. ఇప్పటికే సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల ద్వారా వెల్లడైన విషయం ఏమిటంటే.. ఎన్95 మాస్క్‌లను ధరిస్తే ఇన్‌ఫెక్షన్ రిస్క్ తగ్గుతుందని అంటున్నారు. సాధారణ మాస్క్‌లతో ఇన్‌ఫెక్షన్ ముప్పు 10 శాతం ఉండగా.. ఎన్95 మాస్క్‌లతో ఇన్‌ఫెక్షన్ ముప్పు 1 శాతం మాత్రమే ఉందని, కనుక ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. ఎన్95 మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.
ఇక కొత్త వేరియెంట్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా వ్యాప్తి చెందుతుంది కనుక వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఎన్95 మాస్క్‌ను ధరించాల్సిందేనని.. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవాలని.. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని అంటున్నారు.