Brinjal : ప్రస్తుత తరుణంలో షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అన్ని వయస్సుల వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. గత దశాబ్ద కాలంలో షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య భారీగానే పెరిగింది. ఇది అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. డయాబెటిస్‌లో 3 రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. టైప్ 1, 2లతోపాటు గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు వచ్చే డయాబెటిస్ ఒకటి. అయితే వీటిల్లో టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఇన్సులిన్ నిరోధకత వల్లే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధికంగా బరువు ఉండడం, అస్తవ్యస్తమైన జీవనశైలి, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, శారీరక శ్రమ అసలు లేకపోవడం.. వంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తోంది.
షుగర్ ఉన్నవారు అన్ని రకాలుగా మార్పులు చేసుకుంటేనే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయగలుగుతారు. ముఖ్యంగా తినే ఆహార పదార్థాల్లో ఫైబర్ అధికంగా ఉండాలి. దీంతో రక్తంలో చక్కెర నెమ్మదిగా కలుస్తుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందుకు గాను షుగర్ పేషెంట్లకు వంకాయలు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పవచ్చు. వంకాయలు మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ భిన్న రకాల రంగులు, సైజల్లో లభిస్తున్నాయి. అందువల్ల వీటిని కొనుగోలు చేసి తినడం చాలా తేలికే. వంకాయలను రోజూ వారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ లక్షణాలు
డయాబెటిస్ ఉన్నవారిలో తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, సడెన్‌గా బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, ఇన్ఫెక్షన్లు రావడం, ఆకలి, దాహం విపరీతంగా ఉండడం వంటి లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి.
వంకాయల్లో ఉండే పోషకాలు
షుగర్ పేషెంట్లకు వంకాయలు ఎంతగానో దోహదపడతాయి. షుగర్ లెవల్స్ ను తగ్గించేందుకు సహాయ పడతాయి. వంకాయల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కార్బొహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు వంకాయలు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పవచ్చు.
వంకాయలను తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. పైగా గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడదు. అందువల్ల వీటిని నిర్భయంగా తినవచ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కూడా తక్కువే. అందువల్ల వీటిని తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. ఫలితంగా షుగర్ అదుపులో ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు వంకాయలను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
గుండె జబ్బులు
వంకాయలను తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టం నివారించబడుతుంది. ఈ క్రమంలోనే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి కనుక వంకాయలను తినడం వల్ల ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.