కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది.. అంతా సద్దుమణుగుతోంది.. అనుకుంటున్న తరుణంలో.. ఆ వైరస్ మళ్లీ ఒమిక్రాన్ రూపంలో వ్యాప్తి చెందుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను మళ్లీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే మన దేశంలోనూ రోజు రోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
మన దేశంలో శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 26 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100కు చేరుకుంది. మంగళ, బుధ వారాల్లో 12 కొత్త ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. గురువారం 14 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి.
ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరిస్తోంది. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తోంది. అనవసరంగా బయట తిరగవద్దని, మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నమోదు అయిన ఒమిక్రాన్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలో దేశంలోనే అధిక సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 40 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే ఈ రాష్ట్రంలో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్ర తరువాత స్థానంలో ఢిల్లీ ఉంది. ఇక్కడ శుక్రవారం 12 కేసులు రాగా, మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 22కు చేరుకుంది.
తరువాతి స్థానాల్లో వరుసగా రాజస్థాన్ (17 ఒమిక్రాన్ కేసులు), తెలంగాణ (8), కర్ణాటక (8), కేరళ (7) ఉన్నాయి. ఇక గుజరాత్‌లో 7, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌లలో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యాయి.