Unhealthy Lunch Habits : ఉరుకుల పరుగుల జీవితం కారణంగా మనలో చాలా మంది మధ్యాహ్న భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొందరు బరువు తగ్గాలని మధ్యాహ్నం భోజనాన్ని తినడమే మానేస్తున్నారు. అలాగే మరికొందరు భోజనం చేసిన తరువాత నిద్ర వస్తుందని అలసటగా ఉటుందని భోజనం చేయడమే మానేస్తారు. మధ్యాహ్నం చక్కగా భోజనం చేయాల్సిన సమయంలో కాఫీ, టీలను, జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా మధ్యాహ్న భోజనాని నిర్లక్ష్యం చేయడం, పూర్తిగా తినడమే మానేయడం వంటివి మంచిది కాదని ఈ అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న భోజనం దాటేయడం వల్ల మనం రోజులో అతిగా తినే అవకాశం ఉంది. అలాగే ఇది మన శక్తి సామర్థ్యాలపై మన ఏకాగ్రతపై కూడా ప్రభావం చూపుతుంది.
కనుక సమతుల్య ఆహారాన్ని రోజూ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే కేలరీలు, సోడియం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో హాని కలుగుతుంది. కనుక ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ , ఉప్పు, చక్కెర కలిగిన జంక్ ఫుడ్ ను, ఫ్రోజెన్ మీల్స్ వంటి వాటిని కూడా తీసుకోవడం తగ్గించాలి. వీటికి బదులుగా కూరగాయలను తీసుకోవడానికి ప్రయత్నించాలి. కూరగాయలల్లో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే మధ్యాహ్న భోజనంలో వివిధ రకాల కూరగాయలకు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. చాలా మంది పని ఎక్కువగా ఉందని, సమయం తక్కువగా ఉందని వారు కూర్చున్న దగ్గరే ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.
భోజనానికి నిర్ణయించిన సమయంలో, నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే భోజనాన్ని తింటూ ఆస్వాదించాలి. అలాగే చాలా మంది శీతల పానీయాలను, పంచదార ఎక్కువగా ఉండే పానీయాలను తాగుతూ ఉంటారు. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివికావు కనుక వీటిని బదులుగా హెర్బల్ టీ వంటి వాటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇక మనం ఆహారాన్ని తీసుకునే ముందు ఏం తింటున్నామో తెలసుకుని మనం తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. ఇలా తినడం వల్ల మనం ఎక్కువగా తినకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. అలాగే ఇలా తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
ఇక వండుకునే సమయం లేక చాలా మంది ఫుడ్ ను బయట నుండి తెప్పించుకుని తింటూ ఉంటారు. ఇది కూడా మంచి పని కాదు. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక మరికొంత మంది సమయం తక్కువగా ఉందని ఆహారాన్ని వేగంగా తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగ్గా ఆహారం జీర్ణమవ్వదు. ఆహారాన్ని చక్కగా నమిలి తినాలి. ఇక నుండైనా మనం తీసుకునే మధ్యాహ్న భోజన సమయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని మధ్యాహ్న భోజనం విషయంలో మనకు ఉన్న ఈ చెడు అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.