Acupressure Point On Ear : అధిక బరువు.. నేడు అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కారణాలేమున్నా నేడు అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఊబకాయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడం తదితర జాగ్రత్తలు తీసుకోకపోతే స్థూలకాయం కారణంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అధిక బరువును తగ్గించుకునేందుకు ఎన్నో రకాల పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ఆక్యు ప్రెషర్.
శరీరంలోని పలు భాగాల్లో ఉన్న నాడులు దేహంలోని ఇతర అవయవాలకు అనుసంధానమై ఉంటాయి. ఈ క్రమంలో ఆ నాడులపై తగినంత ఒత్తిడిని కలగజేస్తూ కొద్ది సేపు వాటిపై మసాజ్ చేస్తే ఆయా అవయవాలు ఉత్తేజితమై మనకు కలిగే పలు అనారోగ్యాలు కూడా దూరమవుతాయి. దీన్నే ఆక్యుప్రెషర్ వైద్యం అంటారు. అయితే ఆక్యు ప్రెషర్ వైద్యం వల్ల శరీరంలో అధికంగా ఉన్న బరువును కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..
మీ చెవి దగ్గర త్రికోణాకారంలో ఉన్న ఓ భాగం వద్ద చూపుడు వేలితో ఒకసారి టచ్ చేసి అలాగే ఉంచండి. ఇప్పుడు మీ దవడను ఒకటి రెండు సార్లు పైకి కిందికి తెరచి మూయండి. ఆ.. అదే.. మీరు చూపుడు వేలు ఉంచిన ప్రదేశం వద్ద ఒక దవడ మూమెంట్ మీకు తెలుస్తుంది. ఆ మూమెంట్ వచ్చే ప్రదేశంపై వేలిని ఉంచి ఒక నిమిషం పాటు ఆ ప్రాంతంలో ఒత్తిడిని కలగజేస్తూ సున్నితంగా మర్దనా చేయండి. నిత్యం ఇలా చేసి చూస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. త్వరలోనే మీరు అధిక బరువు తగ్గుతారు కూడా. అయితే ఇది చేస్తున్నాం కదాని ఎక్కువగా తింటూ అసలు పాటించాల్సిన కనీస జాగ్రత్తలను మాత్రం మరువకండి. వాటిని పాటిస్తూనే పరిమిత మోతాదులో ఆహారం తింటూ పైవిధంగా బరువును తగ్గించుకోవచ్చు.