అధిక శరీర కొవ్వు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఉదరం చుట్టూ ఉన్న కొవ్వు చాలా హానికరం. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పొట్ట దగ్గరి కొవ్వు గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు రక్తంలో అధిక చక్కెర స్థాయిలకి కూడా కారణం అవుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సరిగా ఉండదు. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవాలి. అందుకు కింద తెలిపిన కూరగాయలు సహాయ పడతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరుగుతుంది.
1. పాలకూర
పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది కొవ్వును కరిగించే గుణాలను కలిగి ఉంటుందని అధ్యయనాలు రుజువు చేశాయి. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాలకూరను ఉడికించి లేదా నేరుగా కూడా తినవచ్చు. ఇది అదనపు కొవ్వును కరిగించడానికి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
2. బ్రోకలీ
బ్రోకలీలో అధిక నాణ్యత కలిగిన ఫైబర్ (పీచు పదార్థం) ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బ్రోకోలీలో కొవ్వుతో పోరాడే ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. బ్రోకలీలో ఉన్న ఫోలేట్ మీ శరీర భాగాల చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
3. క్యారెట్లు
క్యారెట్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైబర్ పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు, పొట్ట దగ్గరి కొవ్వు కరగాలనుకునేవారు నిత్యం క్యారెట్లను తినాల్సి ఉంటుంది.
4. కీరదోస
కీరదోసలను తినడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. వీటిని నేరుగా తినవచ్చు కనుక నిత్యం వీటిని ఆహారంలో చాలా సులభంగా తీసుకోవచ్చు. వీటిని తినడంవల్ల శరీరానికి ఫైబర్ అందుతుంది. అందువల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా అధిక బరువు తగ్గడంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
5. బీన్స్
వీటిల్లో ఫైబర్ పుష్కలగా ఉంటుంది. ఇది కొవ్వు కరిగేందుకు సహాయ పడుతుంది. స్థూలకాయం రాకుండా చూస్తుంది. బరువును నియంత్రిస్తుంది.
పొట్ట దగ్గర కొవ్వు అధికంగా ఉన్నవారు పైన తెలిపిన కూరగాయలను నిత్యం తీసుకోవడంతోపాటు మద్యం సేవించడం, పొగ తాగడం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. నిత్యం తగినంత నిద్రపోవాలి. అతిగా ఆహార పదార్థాలను తినరాదు. శరీరానికి అవసరం ఉన్నంత మేరే భోజనం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తినరాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కనీస శారీరక శ్రమ చేయడం వంటి అలవాట్లను పాటిస్తే శరీరంలో ఏ భాగంలోనైనా సరే కొవ్వు చేరకుండా ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.