Bilwa Leaves : మహా శివుడికి ఎంతో ఇష్టమైనా మారేడు పత్రం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మారేడు ఆకులకు ఎంతో విశిష్టత ఉంది.వీటినే బిళ్వ పత్రం అని కూడా అంటారు. శివుడికి మారేడు ఆకులు సమర్పించి వేడకుంటే కోరిన కోర్కెలు తప్పకుండా నెరవేరుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదపరంగా కూడా మారేడు ఆకులకు ఎంతో విశిష్టత ఉంది. మారేడు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మారేడు ఆకులను ఉపయోగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి… వీటిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉదయం పరగడుపున రెండు నుండి మూడు మారేడు ఆకులను తినడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మారేడు ఆకులు ముఖ్యం గా పిత్త దోషాలను తగ్గించడంలో చక్కటి ఔషధంలా పని చేస్తాయి. మారేడు ఆకులను తినడం వల్ల పిత్త దోషం ఎక్కువవడం వల్ల వచ్చే అల్సర్లు తగ్గుతాయి. అలాగే వీటిని తినడం వల్ల పొట్ట శుభ్రమవుతుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. అంతేకాకుండా మారేడు ఆకులను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు రోజూ మారేడు ఆకులను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల నెలలోనే మనం 5 నుండి 6 కిలోల బరువు తగ్గవచ్చు. అదేవిధంగా మారేడు ఆకులను తినడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు అంది జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. బిళ్వ పత్రాలను తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మారేడు ఆకులను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో పేరుకుపోయిన మలినాలు తొగిపోయి రక్తం శుద్ది అవుతుంది. మారేడు ఆకులను నేరుగా తినలేని వారు వాటి నుండి రసాన్ని తీసుకుని కూడా తాగవచ్చు. కేవలం మారేడు ఆకులే కాకుండా మారేడు కాయలు, మారేడు చెట్టు బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మారేడు కాయలను తినడం వల్ల వాటితో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల అలాగే మారేడు బెరడుతో కషాయన్ని చేసుకుని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా మారేడు ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.