Aloo Suji Cutlet : మనం సాయంత్రం సమయాల్లో రకరకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోదగిన స్నాక్స్ లో ఆలూ సూజీ కట్లెట్ కూడా ఒకటి. బంగాళాదుంపలు అలాగే బొంబాయి రవ్వ కలిపి చేసే ఈ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా వీటిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ ఆలూ సూజీ కట్లెట్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ సూజీ కట్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, బొంబాయి రవ్వ – 100 గ్రా., పెరుగు – 70 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వంటసోడా – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
అలూ సూజీ కట్లెట్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు బంగాళాదుంపలను మెత్తగా చేసుకుని ముందుగా సిద్దం చేసుకున్న రవ్వలో వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, వంటసోడా వేసి కలపాలి. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ తగినంత రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ కట్లెట్ ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని కట్లెట్ లను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ సూజీ కట్లెట్ తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చక్కగా ఉంటాయి. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.