Velakkaya Perugu Pachadi : వెలగపండు.. ఇది మనందరికి తెలిసిందే. వినాయక చవితి రోజు వెలగపండును మనం వినాయకుడికి నైవేధ్యంగా సమర్పిస్తూ ఉంటాం. అలాగే ఈ వెలగపండును మనం కూడా తింటూ ఉంటాం. వెలగపండులో బెల్లం కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వెలగపండులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. చర్మ సమస్యలను తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ఇలా అనేక విధాలుగా వెలగపండు మనకు సహాయపడుతుంది. దీనిని నేరుగా తినడంతో పాటు ఈ వెలక్కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. వెలక్కాయ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులభం. రుచిగా వెలక్కాయలతో పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెలక్కాయ పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పండిన వెలక్కాయలు – 2, పచ్చిమిర్చి – 5 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, పెరుగు – ఒక కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – రెండు టీ స్పూన్స్, శనగపప్పు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్.
వెలక్కాయ పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెలక్కాయలో ఉండే గుజ్జును తీసి జార్ లో వేసుకోవాలి. తరువాత దీనిని కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దానిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెలక్కాయ పెరుగు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వెలక్కాయలు దొరికినప్పుడు ఇలా వాటితో పెరుగుపచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.