Boiled Eggs : మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను కలిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డులో మన శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో కోడిగుడ్లు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ కోడిగుడ్లను ఎలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు… రోజుకు ఎన్ని గుడ్లను తీసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డులోని పోషకాలను అధికంగా పొందాలంటే వీటిని ఉడికించి తీసుకోవడమే ఉత్తమం.
అలాగే కోడిగుడ్డును ఎక్కువగా ఉడికించకూడదు. కోడిగుడ్డును 13 నుండి 15 నిమిషాల కంటే ఎక్కువగా ఉడికించకూడదు. అలాగే కోడిగుడ్డును ఉడికించిన వెంటనే తినాలి. వీటిని నిల్వ చేసుకుని తినకూడదు. ఉడికించిన కోడిగుడ్డుపై బ్యాక్టీరియా, వైరస్ లు త్వరగా చేరుతాయి. కోడిగుడ్డును ఉడికించిన మూడు గంటల లోపే తినాలి. అదే విధంగా ఉడికించి పొట్టు తీసిన కోడిగుడ్లను ఒక రోజుకంటే ఎక్కువగా ఫ్రిజ్ లో ఉంచకూడదు. అలాగే రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను మాత్రమే ఉడికించి తీసుకోవాలి. రెండు గుడ్లను తీసుకున్నప్పటికి ఒక్క పచ్చ సొనను మాత్రమే తినాలి. మధుమేహంతో బాధపడే వారు వారానికి రెండు గుడ్లను మాత్రమే తీసుకోవాలి. అయితే గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు, మధుమేహ వ్యాధి గ్రస్తులు ఈ పచ్చసొనను తీసుకోకపోవడమే మంచిది.
ఇలా గుడ్డును ఉడికించి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటిలో శుక్లాలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట అల్పాహారంలో భాగంగా గుడ్డును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట గుడ్డును తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయదు. దీంతో మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. ఈ విధంగా బరువు తగ్గడంలో కోడిగుడ్డు ఉపయోగపడుతుంది. రోజుకు రెండు కోడిగుడ్ల చొప్పున ఆరు వారాల పాటు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో హెచ్ డి ఎల్( మంచి కొవ్వు స్థాయిలు ) పెరుగుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కోడిగుడ్డును తీసుకోవడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లను తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు, గోర్లు ఆరోగ్యంగా తయారవుతాయి. గర్భిణీ స్త్రీలు రోజుకో ఉడికించిన కోడిగుడ్డును తినడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. పిల్లలకు కోడిగుడ్డును ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్డును తినడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా కోడిగుడ్డు మనకు ఎంతో ఉపయోగపడుతుందని రోజుకో ఉడికించిన కోడిగుడ్డును తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.