Burning Biryani Leaf : బిర్యానీ ఆకుల గురించి అందరికీ తెలిసిందే. వీటినే హిందీలో తేజ్ పత్తా అంటారు. ఎక్కువగా మసాలా వంటకాలతోపాటు బిర్యానీ, పులావ్ వంటివి చేసినప్పుడు ఈ ఆకులను వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఈ ఆకులను వంటల్లో ఉపయోగించడాని కన్నా ముందు నుంచే వీటిని వైద్యంలో ఉపయోగిస్తున్నారు. పూర్వం గ్రీకులు, రోమన్లు బిర్యానీ ఆకులను ఎక్కువగా వైద్యంలో ఉపయోగించేవారు. అయితే ఇవి మంచి సువాసనను కలిగి ఉండడంతోపాటు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది కనుక వీటిని వంటల్లోనూ వేయడం మొదలు పెట్టారు. అలా బిర్యానీ ఆకుల వాడకం ఎక్కువైంది. ఒక్క ఆకును వంటలో వేసినా చాలు.. ఎంతో కమ్మని వాసన వస్తుంది. ఆ వంట రుచిగా కూడా ఉంటుంది.
బిర్యానీ ఆకులు ఆయుర్వేద పరంగా మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. బిర్యానీ ఆకు ఒకదాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. లేదా ఈ ఆకును కాస్త వేయించి పొడి చేసి ఆ పొడిని కూడా ఉపయోగించుకోవచ్చు. బిర్యానీ ఆకులను వాడడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ ఆకుల పేస్ట్‌ను నీటితో కలిపి పెడితే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఈ ఆకుల నీళ్లను తాగడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి.
బిర్యానీ ఆకు సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని అరోమాథెరపీలో చికిత్స కోసం కూడా ఉపయోగిస్తారు. ఇందుకు గాను ఈ ఆకును కాల్చి దీని నుంచి వచ్చే వాసనను పీల్చాల్సి ఉంటుంది. ఒక గదిలో దీన్ని కాల్చాలి. తలుపులు, కిటికీలు అన్నీ మూసి వేయాలి. ఈ ఆకులను కాల్చిన తరువాత 10 నిమిషాల పాటు గదిని మూసి ఉంచి అనంతరం లోపలికి వెళ్లాలి. అప్పుడు అందులో ఉండే వాసనను పీల్చాలి. ఇలా చేయడం వల్ల అరోమాథెరపీ జరుగుతుంది. దీంతో టెన్షన్, ఒత్తిడి, ఆందోళన అన్నీ తగ్గిపోతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడతారు. నిద్రలేమి తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది.
ఇక ఈ ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ, వాసన కీటకాలు, పురుగులకు పడదు. కనుక దోమలు, ఈగలు, బొద్దింకల బెడద ఉండదు. కాబట్టి ఈ చిట్కాను కిచెన్‌లోనూ ఉపయోగించవచ్చు. ఇలా బిర్యానీ ఆకులతో అనేక లాభాలను పొందవచ్చు. కనుక దీన్ని ఉపయోగించడం మరిచిపోకండి.