Chickpeas : మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. ఎప్పుడైతే పోషకాలు మనకు సక్రమంగా అందుతాయో నిత్యం ఆరోగ్యంగా జీవనం గడుపుతారు. ఏదైనా అనారోగ్య సమస్యకు గురైతే చాలు ప్రతి ఒక్కరు బాదం, పిస్తా తినండి బలంగా ఉంటారు అంటూ సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఒక కేజీ బాదం ఖరీదు దాదాపుగా రూ.800 ఉంటుంది. కేవలం గొప్పవారికి మాత్రమే ఆరోగ్యంలో బలహీనతలు ఉండవు, పేదవారు కూడా అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా వీరిలో పోషకాల లోపం అనేది అధికంగా ఉంటుంది. అలాంటి వారికి బాదం అనేది అందని ద్రాక్షలా కనిపిస్తోంది.
కేవలం బాదం, పిస్తాలు తింటేనే పోషకాహార లోపం తగ్గి బలం చేకూరుతుందని చెప్పాలి అంటే కాదనే చెప్పవచ్చు. బాదం కంటే దీటుగా పోషకాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శనగలు కూడా ఒకటి. ఫాబేసి కుటుంబానికి చెందిన శనగలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శనగలను పేదవాని బాదం అని అంటారు. శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన రక్తంలోని చక్కెరస్థాయిని తగ్గించే ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది.
శనగల్లో కాల్షియం, విటమిన్ కె, మెగ్నిషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉండం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. శనగల్లో ఉండే విటమిన్ బి9 మెదడు, కండరాలు, నాడీవ్యవస్థలను సక్రమంగా పనిచేయటానికి సహాయపడుతుంది.
శనగలను ఆహారంగా తీసుకోవడం వలన ఐరన్, ప్రొటీన్, మినరల్స్ వంటివి శరీరానికి ఎనర్జీని అందించి అలసట, నీరసం, నిస్సత్తువ వంటి వాటిని తగ్గిస్తుంది. శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. తద్వారా అధిక బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. అందువల్ల శనగలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.