మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్రశ్న, రైలు ఎక్కని వారు ఎవరైనా ఉంటారా? అని అడగబోతున్నారా? అయితే అసలు మ్యాటర్ మాత్రం అది కాదు లెండి. ఎందుకంటే ఆ ప్రశ్నకు ఇంకా కొనసాగింపు ఉంది. అదేమిటంటే… రైలు ఎక్కడానికి స్టేషన్‌కు వెళ్లినప్పుడు రైలు బోగీలను జాగ్రత్తగా గమనించారా. ప్రధానంగా రైలు చివరి పెట్టె వెనుక భాగాన్ని పరిశీలించారా? పరిశీలించాం, చూశాం, అయితే ఏమిటి అంటారా? ఆ, అయితే అక్కడే ఆగండి. రైలు చివరి పెట్టె వెనుక భాగంలో ఆంగ్ల అక్షరం X అని పెద్దగా రాసి ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా చూశారా? చూశాం, అయితే ఏంటి అంటారా? ఆ, అదే… దాని గురించే మేం చెప్పబోయేది. అసలు అలా X అని ఎందుకు రాసి ఉంటుందో మీకు తెలుసా? తెలీదా? అయితే ఎందుకో తెలుసుకోండి!
రైలు బోగీల్లో చివరి బోగీ వెనుక X అని రాసి ఉంటే ఆ రైలుకు ఆ పెట్టే చివరిది అని అర్థం. అంతేకాదు ఆ X అక్షరం కిందే ఓ ఎర్రని లైటు, దాని పక్కనే LV అనే ఓ బోర్డు కూడా తగిలించబడి ఉంటుంది. ఇవన్నీ X అక్షరం లాగే ఉపయోగపడతాయి. వీటి వల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెను చివరి పెట్టెగా పరిగణిస్తారు. అయితే X అక్షరం పగటి సమయంలో ఉపయోగపడితే, ఎర్రని లైటు రాత్రి పూట ఉపయోగపడుతుంది. దీని వల్ల వాటిని చూసే వారు ఆ రైలు అన్ని పెట్టెలతోనే వెళ్తుందని అర్థం చేసుకుంటారు.
ఒక వేళ రైలు చివరి పెట్టెకు ఈ అక్షరాలు ఏవీ లేకపోతే అది ప్రమాదవశాత్తూ కొన్ని బోగీలు లేకుండానే నడుస్తుందని తెలుసుకుంటారు. దీంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. సో, రైలు చివరి పెట్టె వెనుక ఉన్న అక్షరాల మతలబు అదన్నమాట. ఇక ముందు మీరెప్పుడైనా వాటిని చూస్తే ఇంకాస్త జాగ్రత్తగా పరిశీలించండేం. పైన చెప్పిన అక్షరాలు అన్నీ కనిపిస్తాయి. ఒక వేళ కనిపించకుంటే మాత్రం ఎవరికైనా రైల్వే అధికారులకు తెలియజేయడం మాత్రం మరిచిపోకండి.