Diet Plan For Diabetes : మనల్ని వేధించే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే మనం జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితమైన ఆహార నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయంపై అనేక అనుమానాలు ఉంటాయి. షుగర్ వ్యాధి ఎక్కువవుతుందనే భయంతో చాలా మంది అనేక రకాల ఆహారాలను దూరం పెడుతూ ఉంటారు. దీంతో సరైన పోషకాలు అందక ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలా షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఆహార ప్రణాళికను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ ఆహార ప్రణాళికను పాటించడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు అనుసరించదగిన ఆహార ప్రణాళిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట వెజిటేబుల్ డాలియాతో పాటు రెండు వెజిటేబుల్ స్టఫ్డ్ పరాటాలను తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ కోసం ఒక గుడ్డు, ఒకటి లేదా రెండు గ్రిల్డ్ హోల్ వీట్ టోస్ట్ లను తీసుకోవాలి. అలాగే పంచదార, కొవ్వు లేని పాలతో టీ, కాఫీ చేసి తీసుకోవాలి. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఉండే పండ్లను తీసుకోవాలి. ఇకభోజనం కోసం వండిన లేదా సలాడ్ కూరగాయలతో పాటు 50 శాతం బార్లీతో రెండు చపాతీలను తీసుకోవాలి. అలాగే పప్పు, చికెన్, పెరుగు, శనగలతో వండిన కూరలను తీసుకోవచ్చు. అలాగే జొన్నలు, సజ్జలతో తయారు చేసిన రోటీలను తీసుకోవచ్చు. ఈ విధంగా ఉదయం, మధ్యాహ్నం ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అయితే రోజూ ఉదయాన్ని ఒక గ్లాస్ నీటితో ప్రారంభించాలి.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తీసుకోవాలి. ఈ నీటిలో ఉసిరిపొడి, దాల్చిన చెక్క పొడిని కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం రోజూ 8 నుండి 10 నానబెట్టిన బాదం గింజలను తీసుకోవచ్చు. అలాగే వాల్ నట్స్, అవిసె గింజలు వంటి వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి. ఇక షుగర్ వ్యాధితో బాధపడే వారు షుగర్ స్థాయిలను త్వరగా పెంచే టేబుల్ షుగర్, మైదా వంటి వాటిని తీసుకోకూడదు. అలాగే అరటి, ద్రాక్ష, చిలగడదుంప, బంగాళాదుంప వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. అదే విధంగా మన శరీరంలోకి వెళ్లే క్యాలరీలు, చక్కెరలపై నియంత్రణ కలిగి ఉండాలి. ఆహారం తీసుకునేటప్పుడు చిన్న ప్లేట్ లను వాడాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి మింగాలి.