Milk : మనం తీసుకునే ఆహారాల్లో పాలు కూడా ఒకటి. పాలు సంపూర్ణ ఆహారమని నిపుణులు చెబుతూ ఉంటారు. పిల్లల నుండి పెద్దల వరకు వీటిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటారు. పాలల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా పాలను ఆహారంగా తీసుకోమని చెబుతూ ఉంటారు. పాలు జంతు సంబంధిత ఆహారం. జంతు సంబంధిత ఆహారాల్లో హార్మోన్లు, ఎంజైమ్స్, ఆమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇటువంటి పదార్థాలను సరైన సమయంలో, సరైన పద్దతిలో, సరైన ఆహారాలతో కలిపి తీసుకోవాలి. లేదంటే శరీరంలో రసాయన చర్మలు జరిగి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
పాలను కూడా మనం సరైన సమయంలో తీసుకోవాలి. పాలను రోజూ తాగుతున్నప్పటికి కొందరికి వాటిలో ఉండే పోషకాలు సరైన మోతాదులో అందవు. అలాగే కొందరిలో పాలు సరిగ్గా జీర్ణం కావు. ఇందుకు కారణం పాలను తాగిన తరువాత లేదా తాగడానికి ముందు ఏదో ఒక ఆహారాన్ని తీసుకోవడమే. పాలు సరిగ్గా జీర్ణం కానందు వల్ల రసాయన చర్యలు జరిగి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాలను సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల అలాగే వాటిని ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల మనం అనేక ఇతర దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. పాలు తాగడం మన శరీరానికి ఎంత అవసరమో వాటిని సరైన పద్దతిలో తాగడం కూడా అంతే అవసరం. పాలను ఎప్పుడు తీసుకోవాలి.. అలాగే ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన తరువాత పాలను తాగకూడదు. ఇలా చేయడం వల్ల పాలు సరిగ్గా జీర్ణం అవ్వవు. అలాగే భోజనం చేసిన పాలను తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భోజనం చేసిన తరువాత పాలను తాగాలనుకునే వారు భోజనం చేసిన 2 గంటల తరువాత వాటిని తాగాలి. అదే విధంగా పాలను తాగిన తరువాత మరియు తాగడానికి ముందు పుల్లటి రుచిని కలిగి ఉండే పండ్లను, అలాగే ఉప్పు వాడి తయారు చేసిన పదార్థాలను తీసుకోకూడదు. పుల్లటి పండ్లతో కలిసిన పాలు జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉల్లిపాయలను, వంకాయలను భోజనంలో తీసుకున్న వెంటనే పాలను తాగకూడదు. అలాగే పాలను తాగిన వెంటనే వీటిని తీసుకోకూడదు. ఉల్లిపాయలు, వంకాయలు పాలకు విరుద్ద ఆహారాలు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల అలర్జీలు, దురదలు, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. కనుక వీటిని తీసుకున్న రెండు గంటల తరువాత మాత్రమే పాలను తాగాలి.
అలాగే పాలను, మాంసాన్ని, చేపలు కలిపి తీసుకోకూడదు. ఈ పదార్థాలన్నింటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే పాలు, పెరుగును కలిపి లేదా వెంటవెంటనే తీసుకోకూడదు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పాలను మనం రాత్రి పూట తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పాలను రాత్రి పూట తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పట్టడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని ఆ సమయంలో తీసుకోవడం వల్ల పాలు త్వరగా జీర్ణమవుతాయని వారు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడే వారు ఆవు పాలను తాగాలి. సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారు గేదె పాలను తాగాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల పాలల్లో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి.