గ్యాస్ ట్రబుల్ సమస్య అనేది ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని వల్ల చాలా మంది అవస్థలు పడుతుంటారు. గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన విధంగా సూచనలను పాటించడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య అసలు ఉండదు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
1. ఉదయం నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ పావు గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీని వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. పేగుల్లో ఉండే మలం వల్లే గ్యాస్ సమస్య వస్తుంటుంది. కనుక విరేచనం అయితే గ్యాస్ రాదు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే 1 లీటర్ పావు గోరు వెచ్చని నీళ్లను తాగాలి. ఒకేసారి తాగలేకపోతే 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తాగవచ్చు. దీంతో విరేచనం అవుతుంది. తరువాత 1 గంట ఆగి మళ్లీ నీళ్లను తాగి మల విసర్జన చేయాలి. దీంతో పేగుల్లో ఉండే మలం మొత్తం బయటకు పోతుంది. జీర్ణాశయం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. గ్యాస్ అసలే ఉండదు. ఇలా రోజూ చేస్తే గ్యాస్ సమస్య అస్సలు రాదు.
2. సాధారణంగా భోజనం చేసేటప్పుడు చాలా మంది నీళ్లను తాగుతుంటారు. అలా చేయరాదు. అలాగే భోజనానికి ముందు గానీ, భోజనం చేసిన వెంటనే గానీ నీళ్లను తాగరాదు. తాగితే జీర్ణరసాలు పలుచగా మారి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి భోజనం సమయంలో నీళ్లను తాగరాదు. నీళ్లను తాగాక కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండాలి. తరువాతే ఆహారం తినాలి. అలాగే తిన్న తరువాత 30 నిమిషాలు ఆగి నీళ్లను తాగాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
3. భోజనాన్ని అతిగా తినరాదు. అలాగే ఎక్కువ సార్లు తినరాదు. అతి భోజనం చేస్తే గ్యాస్ సమస్య వస్తుంది. అలాగే రాత్రి వీలైనంత త్వరగా భోజనం చేయాలి. దీంతో పొట్టకు రెస్ట్ లభిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
4. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. కొందరు చాలా వేగంగా తింటారు. ఆహారాన్ని బాగా నమలరు. అది లోపలికి వెళ్లి జీర్ణం కాక గ్యాస్ సమస్యను కలగజేస్తుంది. కనుక ఆహారాన్ని చాలా నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. దీని వల్ల చాలా వరకు ఆహారం మన నోట్లోనే విభజించబడుతుంది. జీర్ణవ్యవస్థపై పెద్దగా భారం పడకుండానే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య రాదు. అలాగే జీర్ణాశయం పూర్తిగా నిండేలా తినరాదు. కనీసం 25 శాతం ఖాళీ ఉంచాలి. దీని వల్ల గ్యాస్ ఏర్పడదు. ఈ విధంగా సూచనలు పాటిస్తే గ్యాస్ జన్మలో రాదు.