మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లలో ఫోలిక్ యాసిడ్ ఒకటి. దీన్నే ఫోలేట్ అంటారు. విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ మన శరీరంలో అనేక పనులకు ఉపయోగపడుతుంది. గర్భవతులకు వైద్యులు ఈ విటమిన్‌కు చెందిన సప్లిమెంట్లను ఎక్కువగా ఇస్తుంటారు. ఎందుకంటే ఇది వారి గర్భంలోని బిడ్డకు ఎంతగానో అవసరం అవుతుంది. బిడ్డ ఎదుగుదలకు ఫోలేట్ ఉపయోగపడుతుంది.
ఫోలిక్ యాసిడ్ వల్ల కొత్త కణాలు నిర్మాణం అవుతాయి. అందువల్ల ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుంది. ఇక సాధారణ వ్యక్తులకు కూడా ఫోలిక్ యాసిడ్ అవసరమే. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుట్టబోయే పిల్లల్లో లోపాలు రాకుండా చూస్తుంది. డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఎర్ర రక్త కణాలు ఏర్పడుతాయి. ఇలా ఫోలిక్ యాసిడ్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఫోలిక్ యాసిడ్ మనకు రోజుకు 400 మైక్రోగ్రాముల వరకు అవసరం. అదే గర్భిణీలకు అయితే 600 నుంచి 800 మైక్రోగ్రాముల వరకు అవసరం అవుతుంది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా గుడ్లు, బాదంపప్పు, వాల్ నట్స్, బీట్ రూట్, టమాటా, అవకాడో, లివర్, క్యాబేజీ వంటి వాటిల్లో లభిస్తుంది. అయితే అన్నింటికన్నా ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ మనకు రాజ్మా విత్తనాల్లో లభిస్తుంది.
100 గ్రాముల రాజ్మా విత్తనాలను ఇంటే మనకు 20 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. 300 క్యాలరీల శక్తి వస్తుంది. అలాగే 316 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. అందువల్ల రాజ్మాను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఇక ఫోలిక్ యాసిడ్ శనగలు, పెసలలోనూ లభిస్తుంది. వీటిని కూడా తరచూ తీసుకోవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో లభించాలంటే మాత్రం రాజ్మాను తీసుకోవాలి. చికెన్, మటన్ కన్నా రాజ్మా తక్కువ ధరలో లభిస్తాయి. పైగా ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లు కూడా ఉంటాయి. కనుక ఇవి ఫోలిక్ యాసిడ్‌కు అత్యుత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు.
రాజ్మాలలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రాజ్మా విత్తనాలను రోజూ నీటిలో నానబెట్టి తరువాత ఉడికించి తినవచ్చు. లేదా కూరల్లోనూ వేసుకోవచ్చు. ఏవిధంగా తీసుకున్నా వాటితో లాభాలే కలుగుతాయి.