Meal Maker : మనం మీల్ మేకర్ లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేకర్ లతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది మీల్ మేకర్ లపై వివిధ రకాల సందేహాలను కలిగి ఉన్నారు. మీల్ మేకర్ లను అసలు తినవచ్చా.. ఇవి శాఖాహారమా, మాంసాహారమా… వీటిని తినడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయా.. లేదా.. ఇలా అనేక రకాల సందేహాలను కలిగి ఉన్నారు. మీల్ మేకర్ లను అసలు ఎలా తయారు చేస్తారు… వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి…వీటిని ఎవరు తీసుకోకూడదు.. వీటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీల్ మేకర్ లు పూర్తిగా శాఖాహారమే. వీటిని సోయా గింజల నుండి తయారు చేస్తారు.
సోయా గింజల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పితో మీల్ మేకర్ లను తయారు చేస్తారు. మీల్ మేకర్ లతో మసాలా కూరలను, మంచురియాను కూడా తయారు చేస్తారు. అలాగే కిచిడి, బిర్యానీ వంటి వాటిల్లో కూడా ఉపయోగిస్తారు. మీల్ మేకర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అదే విధంగా మీల్ మేకర్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల మీల్ మేకర్ లల్లో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిలో కోడిగుడ్లు, పాలు, మాంసంతో సమానమైన ప్రోటీన్ ఉంటుంది. కనుక శాఖాహారులు వీటిని తప్పకుండా తీసుకోవాలి. కండపుష్టి కొరకు వ్యాయామాలు చేసే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మీల్ మేకర్ లను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. వీటిని తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మీల్ మేకర్ లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషులు వీటిని తక్కువగా తీసుకోవాలి. మీల్ మేకర్ లను పురుషులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో ఛాతి పరిమాణం పెరుగుతుంది. అలాగే స్త్రీలు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి శరీరంలో నీరు ఎక్కువగా వచ్చి వాపులు రావడం, కడుపులో గ్యాస్, మొటిమలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అలాగే మీల్ మేకర్ లను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, మలబద్దకం, అతిగా మూత్రానికి వెళ్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీల్ మేకర్ లల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ప్రోటీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కనుక వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజూ 25 నుండి 30 గ్రాముల మీల్ మేకర్ లను మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిని వీలైనంత వరకు ఇంట్లోనే వండుకుని తినాలి. ఈ విధంగా మీల్ మేకర్ లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.