Sweet Corn Butter Masala : మనం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. స్వీట్ కార్న్ ను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. ఇవే కాకుండా స్వీట్ కార్న్ తో అనేక ఇతర ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. వీటిని నేరుగా ఉడికించి తినడంతో పాటు వీటిలో మసాలా పొడి వేసి మరింత రుచిగా తయారు చేసుకుని తినవచ్చు. ఈ స్వీట్ కార్న్ బటర్ మసాలాను మనం కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ స్వీట్ కార్న్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ బటర్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ గింజలు – ఒక కప్పు, బటర్ – అర టేబుల్ స్పూన్, చాట్ మసాలా – పావు టేబుల్ స్పూన్, కారం – అర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నిమ్మకాయ – అర చెక్క.
స్వీట్ కార్న్ బటర్ మసాలా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో ఉప్పు, స్వీట్ కార్న్ గింజలు వేసి ఉడికించాలి. స్వీట్ కార్న్ ఉడికిన తరువాత వాటిని నీళ్లు లేకుండా వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బటర్, కారం, తగినంత ఉప్పు, చాట్ మసాలా వేసి కలపాలి. తరువాత నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ బటర్ మసాలా తయారవుతుంది. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. సాయంత్రం సమయాల్లో స్వీట్ కార్న్ తో ఇలా స్నాక్స్ గా తయారు చేసుకుని తినవచ్చు. ఈ స్వీట్ కార్న్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.