మనం తినే ఆహారానికి రుచిని చేకూర్చడంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది. షడ్రుచుల్లో ఒకటైన ఉప్పుకు వంటకాల్లో విశేష ప్రాధాన్యత ఉంది. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనం సోడియం క్లోరైడ్. సముద్రం నుండి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటుంది. మన శరీరంలో జరిగే జీవక్రియలన్నింటికీ లవణం చాలా అవసరం. ఈ లవణం మనకు ఉప్పు రూపంలో అందుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఉప్పును తినకూడదని, ఉప్పును తింటే రోగాలు ఎక్కువవుతున్నాయని అందరూ చెబుతున్నారు.
అసలు ఉప్పును తినకపోతే ఏం అవుతుంది.. అధికంగా ఉప్పు తింటే ఏం జరుగుతుంది.. రోజుకు ఎంత మోతాదులో ఉప్పును తీసుకోవాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో జరిగే రసాయన చర్యలన్నింటిలోనూ ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కండరాలు సంకోచిండడానికి, వ్యాకోచించడానికి అవసరమయ్యే ద్రవాలను శరీరంలో నిల్వ ఉంచడంలో ఉప్పు చాలా అవసరమవుతుంది. శరీరంలో సోడియం మోతాదు తక్కువైతే డీ హైడ్రేషన్ బారిన పడడమే కాకుండా చికాకు, కోపం, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
జాతీయ పోషకాహార సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం రోజుకు 6 గ్రాముల ఉప్పును తీసుకోవాలి. అయితే ప్రతిరోజూ సగటు భారతీయుడు 30 గ్రాముల ఉప్పును వాడుతున్నాడు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఉప్పును మనం ప్రత్యక్షంగా ఎంత తీసుకుంటున్నామో పరోక్షంగా కూడా అంతే తీసుకుంటున్నాము. మనకు తెలియకుండానే మనం ఉప్పును అధికంగా తీసుకుంటున్నాం. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల సోడియం శరీరంలో అధికంగా చేరి రక్తపోటును పెంచుతోంది. రక్తపోటు పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
శరీరంలో సోడియం ఎక్కువైతే కాల్షియం శాతం తగ్గి ఎముకలు డొల్లబారిపోతాయి. దీంతో కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మెదడులో ఆక్సిజన్ శాతం తగ్గి మెదడులో కణాలు దెబ్బతింటాయి. దీని వల్ల బీపీ ఎక్కువై పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తింటే మూత్ర పిండాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా తక్కువ మోతాదులో తీసుకుంటేనే మనం దాంతో కలిగే ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
ఉప్పు వల్ల కలిగే అనార్థాలను తెలుసుకున్న మన పూర్వీకులు ఉప్పు శని అని నీచ స్థానం కల్పించారు. ఉప్పును పూర్తిగా తీసుకోకపోయినా మనకు ప్రమాదమే. అలాగే ఉప్పును ఎక్కువగా తీసుకున్నా కూడా ప్రమాదమే. కనుక ఉప్పును తగిన మోతాదులో తీసుకుని ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.