Drinking Water : మన శరీరానికి నీరు కూడా ఎంతో అవసరం. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, శరీరంలో మలినాలు బయటకు పోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ఎంతో అవసరమవుతుంది. రోజూ మనం 3 నుండి 4 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలి. అయితే నీటిని తాగే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదు అనే అపోహను కలిగి ఉన్నారు. ఎవరైనా నీటిని తాగినా కూడా రాత్రి సమయంలో నీటిని ఎక్కువగా తాగకూడదు అని చెబుతూ ఉంటారు. అసలు రాత్రి పూట నీటిని ఎక్కువగా తాగాలా.. వద్దా ఈ అపోహ సరైనదేనా… నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే రాత్రి పూట నీటిని తాగడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.
కానీ షుగర్ వ్యాధితో బాధపడే వారు, గుండె సమస్యలతో బాధపడే వారు రాత్రి పూట నీటిని ఎక్కువగా తాగకూడదు అని వారు చెబుతున్నారు. మనం రోజంతా పని చేస్తూ ఉంటాము. దీంతో మన శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. శరీరంలో తగినంత నీటి శాతం లేకుండా మనం నిద్రించడం వల్ల మనం ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. రాత్రి పడుకునే సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల గొంతు ఆరిపోతుంది. గురక ఎక్కువగా వస్తుంది. కనుక మనం నిద్రించేటప్పుడు శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవడం వల్ల శరీరం యొక్క అలసట తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. దీంతో మనం మరుసటి రోజూ ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము.
రాత్రిపూట ఎక్కువగా నీటిని తాగడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి. చర్మం అందంగా,కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే రాత్రి పూట నీటిని ఎక్కువగా తాగడం వల్ల మనం నిద్రించిన తరువాత మూత్రవిసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. మననిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే పొట్ట నిండా నీటిని తాగి పడుకోవడం వల్ల శ్వాస ఇబ్బందులతో పాటు గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక మనం రాత్రి తీసుకునే నీరు మన నిద్రకు ఆటంకం కలగకుండా ఉండేలా చూసుకోవాలి. మనం పడుకునే లోపే మూత్రవిసర్జన జరిగేలా చూసుకుని నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.