Eggs In Winter : చలికాలంలో సహజంగానే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దీని వల్ల శరీరం చల్లగా మారుతుంది. దీంతో రక్త సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా ఎముకల్లో నొప్పి వస్తుంటుంది. అలాగే జుట్టు రాలుతుంది. ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు కూడా మనకు చలికాలంలో వస్తుంటాయి. అయితే చలికాలంలో రోజుకు ఒక కోడిగుడ్డును తినడం వల్ల ఈ సీజన్‌లో వచ్చే అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్లను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కోడిగుడ్లను చలికాలంలో మాత్రం రోజుకు ఒకటి చొప్పున తప్పక తినాల్సిందే. దీంతో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను కోడిగుడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల మనకు విటమిన్లు బి6, బి12 లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించేందుకు సహకరిస్తాయి. కనుక ఈ సీజన్‌లో కచ్చితంగా రోజుకు ఒక గుడ్డును తినాల్సి ఉంటుంది. ఇక కోడిగుడ్లలో విటమిన్ డి, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో లుటీన్, జియాజంతిన్ అనే సమ్మేళనాలను పెంచుతాయి. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. దీని వల్ల చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పుల నుంచి బయట పడవచ్చు.
చలికాలంలో మన శరీరానికి సూర్యరశ్మి సరిగ్గా అందదు. ఫలితంగా విటమిన్ డి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే కోడిగుడ్లను రోజూ తినడం వల్ల ఈ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఒక కోడిగుడ్డులో మనకు రోజుకు కావల్సిన విటమిన్ డిలో 82 శాతం వరకు లభిస్తుంది. అంటే ఒకటిన్నర కోడిగుడ్డును రోజుకు తింటే చాలు. దీంతో మనకు ఒక రోజుకు కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది. దీంతో విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఎముకలు కూడా బలంగా మారుతాయి.
ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డులో దాదాపుగా 0.6 మైక్రోగ్రాముల మేర విటమిన్ బి12 లభిస్తుంది. ఇది మనకు రోజుకు కావల్సిన దాంట్లో 25 శాతం అన్నమాట. అంటే రోజూ గుడ్లను తినడం వల్ల మనం కావల్సినంత విటమిన్ బి12ను పొందవచ్చు. దీంతో విటమిన్ బి12 లోపం తగ్గుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం బాగా తయారవుతుంది. నాడీ మండల వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇక కోడిగుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. శిరోజాలు పెరిగేలా చేస్తాయి. కనుక చలికాలంలో వచ్చే జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇలా కోడిగుడ్లను ఈ సీజన్‌లో తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక రోజూ ఒక కోడిగుడ్డును అయినా తినడం మరిచిపోకండి.