Fattening Foods : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. అధిక బరువు బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అధిక బరువు కారణంగా మనకు అసౌకర్యంగా ఉండడంతో పాటు ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక వీలైనంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడడం చాలా అవసరం. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటూ ఉంటాం.
అయితే అధిక బరువు సమస్యతో బాధపడే వారు అన్నింటి కంటే ముందు ఏ ఆహారాన్ని తీసుకోవాలి.. ఏ ఆహారాన్ని తీసుకోకూడదు అన్న వివరాలను తెలుసుకోవాలి. మనం తీసుకునే ఆహారాలు శక్తిని ఇవ్వడంతో పాటు బరువు తగ్గేలా ఉండాలి. అలాగే రుచిగా ఉండేలా చూసుకోవాలి. రుచి కొరకు నిమ్మకాయ, తేనె, ఖర్జూర పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఉపయోగించాలి. నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కొన్ని రకాల ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల మనం బరువు పెరిగే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మన బరువు తగ్గే ప్రయత్నాన్ని గాడి తప్పేలా చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఎటువంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే వారు అన్నాన్ని అలాగే బంగాళాదుంపలను కలిపి తీసుకోకూడదు. అన్నం సులభంగా జీర్ణమైనప్పటికి దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బంగాళాదుంపలో కూడా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అధిక క్యాలరీలు లభించి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ రెండింటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. అలాగే చాలా మంది ఎక్కువగా సాండ్ విచ్ రూపంలో వైట్ బ్రెడ్ ను, యోగర్ట్ ను కలిపి తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ రెండింటిని కలిపి తీసుకోకూడదు. వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ లేదా చిరు ధాన్యాలతో చేసిన బ్రెడ్ ను తీసుకోవడం మంచిది. అలాగే యోగర్ట్ లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల అధిక క్యాలరీలు లభించి బరువు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారాలను ఒకేసారి తీసుకోవడం కూడా మంచిది కాదు. కొంతమంది చికెన్ తో పాటు పప్పు వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో పాటు బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
కనుక వీటిని వేరువేరుగా తీసుకోవడమే మంచిది. అలాగే చాలా మంది టీ, కాఫీలతో పాటు నూనెలో వేయించిన పదార్థాలను, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తడంతో పాటు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు వీటికి కూడా దూరంగా ఉండాలి. అదే విధంగా పాలు మరియు అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీటిని కలిపి తీసుకోవడం వల్ల వీటిలో ఉండే పోషకాల విలువ తగ్గడంతో పాటు బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ రెండింటికి కనీసం 30 నిమిషాల వ్యవధితో తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆహారాలను దృష్టిలో ఉంచుకుని తగిన డైట్ పద్దతిని పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.