Fenugreek Seeds : మెంతులు.. ఇవి మనందరికీ తెలిసినవే. మన వంటింట్లో ఉండే దినుసుల్లో ఇవి కూడా ఒకటి. మనం మెంతులను కూడా వంటల తయారీలో, పచ్చళ్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులను వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, అలాగే అనారోగ్య సమస్యల నుండి బయట పడడానికి ఈ మెంతులను ఎలా ఉపయోగించాలి.. వంటి తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతుల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే మనం ఆశ్యర్చ పోవాల్సిందే. వీటిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలను గుర్తించిన మన పూర్వీకులు వీటిని మన ఆహారంలో భాగంగా చేశారు. అధిక బరువుతో బాధపడే వారు మెంతులను నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. విరేచనాలతో బాధపడుతున్నప్పుడు మజ్జిగలో మెంతుల పొడిని కలుపుకుని తాగడం వల్ల చక్కని ఉపశమనం కలుగుతుంది.
రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తినడం వల్ల అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. గర్భాశయ సమస్యలతో బాధపడే స్త్రీలకు మెంతులు చక్కని ఔషధంలా పని చేస్తాయి. నానబెట్టిన మెంతులను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల నెలసరి క్రమం తప్పకుండా రావడంతోపాటు నెలసరి సమయంలో వచ్చే నొప్పి కూడా తగ్గతుంది. అదే విధంగా నీళ్లలో మెంతుల పొడిని కలుపుకుని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే తలనొప్పి, వికారం సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. సౌందర్య సాధనంగా కూడా మెంతులు పని చేస్తాయి.
మెంతుల పొడిలో పాలను కలిపి ముఖంపై రాసి మర్దనా చేయాలి. ఇలా చేసిన అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. మెంతులను నానబెట్టి ఆ తరువాత ఉడికించి వడకట్టాలి. ఇలా వడకట్టగా వచ్చిన నీటిలో దూదిని ముంచి ముఖంపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, నల్లని మచ్చలు తగ్గిపోతాయి. నానబెట్టిన మెంతులను పేస్ట్ గా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. కొబ్బరి నూనెలో మెంతి పొడిని వేసి తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా మెంతులు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.