రాత్రివేళ తగినంత సమయం గాఢ నిద్రపోతోనే శరీరం, మెదడు రెండూ ఉదయానికి యాక్టివ్ అవుతాయి. మరి గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలి ? ఇదిగో నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి. వీటిని పాటిస్తే చాలు, పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇక ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పడుకోవడానికి 2 గంటల ముందే భోజనాన్ని పూర్తి చేయాలి. ఆహారం జీర్ణం కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కనుక భోజనానికి, నిద్రకు ఆ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఆహారం జీర్ణం అయ్యాక బెడ్ పైకి చేరితే మంచి నిద్ర పడుతుంది.
పడుకునే ముందు స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహాయ పడుతుంది. అయితే వేడి నీళ్ల స్నానం చేయకూడదు. స్నానం వల్ల శరరీం శుభ్రం అవడమే కాదు, ఒత్తిడి, అలసట కూడా దూరమవుతాయి. నిద్రకు ఉపక్రమించే ముందు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే గాఢనిద్ర మీ సొంతం అవుతుంది. కొద్ది రోజుల్లోనే ఆ మార్పు మీలో స్పష్టంగా కనిపిస్తుంది.
బెడ్‌రూమ్‌లో ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోవాలి. శరీరానికి హాయినిచ్చేలా ఉండాలి. మంచి నిద్రకు ఇది అవసరం. బెడ్ పైకి చేరిన తరువాత ఫోన్‌ను ఎట్టి పరిస్థితిలోనూ చూడకూడదు. గ్యాడ్జెట్స్ వల్ల నిద్ర దూరమవుతుంది. కాబట్టి సైలెంట్ మోడ్‌లో పెట్టి నిద్రకు ఉపక్రమించాలి. గాఢ నిద్ర పోవాలంటే ఏదైనా మంచి పుస్తకం చదవాలి. పుస్తకం చదవడం ప్రారంభించగానే ఆటోమేటిగ్గా నిద్ర ముంచుకొస్తుంది. కనుక ఈ సూచనలు పాటిస్తే పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకోవచ్చు.