Garlic For Cholesterol : మన శరీరంలో ఉండే కీలకమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. కాలేయం మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో ఉండే విష పదార్థాలను, రసాయనాలను, వ్యర్థాలను బయటకు పంపించి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కాలేయం దోహదపడుతుంది. కాలేయం తన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడంలో మనకు వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి దోహదపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. వెల్లులిలో 14.2 మైక్రో గ్రాముల సిలినీయం ఉంటుంది. సిలినీయం ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను రెండు దశల్లో నిర్వీర్యం చేయడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేయడానికి అనేక రకాల ఎంజైమ్ లు అవసరమవుతాయి. ఈ ఎంజైమ్ ల ఉత్పత్తి ఎక్కువగా అయ్యేలా కాలేయాన్ని ప్రేరేపించడంలో, వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియను వేగవంతం చేయడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అదే విధంగా వెల్లుల్లిలో ఉండే డైఅలి, డై సల్ఫైడ్ అనే రసాయన సమ్మేళనాలు కొవ్వు వల్ల కాలేయానికి హాని కలగకుండా చేయడంలో వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయ కణాలు దెబ్బతినకుండా చేయడంలో ఈ వెల్లుల్లి దోహదపడుతుంది. అలాగే దీనిలో ఉండే అలిసిన్ అనే రసాయన సమ్మేళనం కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, కాలేయంలో కొవ్వును నియంత్రించడంలో వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది.
ఈ విధంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వెల్లుల్లిని ఎలా తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వంటల్లో వేయడం వల్ల వెల్లుల్లిలో ఉండే పోషకాలు కొంతమేరకు నశిస్తాయి. కనుక వెల్లుల్లిని చిన్నగా తరిగి తేనెతో కలిపి తీసుకోవడం వల్ల లేదా కొద్దిగా మీగడతో కలిపి చిన్న మంటపై దోరగా వేయించి తీసుకున్నా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ వెల్లుల్లిని తరుచూ తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.