సాధారణంగా చాలా మంది కోడిగుడ్లను ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసుకుని తింటుంటారు. కానీ వైద్యులు మాత్రం కోడిగుడ్లను ఉడకబెట్టి మాత్రమే తినాలని చెబుతారు. ఎందుకంటే గుడ్లను ఫ్రై చేయడం, ఆమ్లెట్ లా వేయడం వల్ల వాటిల్లో పోషకాలు నశిస్తాయి. అందువల్ల ఉడకబెట్టిన కోడిగుడ్లనే తినాలని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మెటబాలిజం
ఉడకబెట్టిన కోడిగుడ్లలో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరం ప్రోటీన్లను బాగా ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో కండరాలు, నాడులకు శక్తి అందుతుంది. అలాగే శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిక్ రేటును పెంచుతాయి. శక్తిని అందిస్తాయి.
కొలెస్ట్రాల్
గుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజానికి రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
క్యాలరీలు
ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడం వల్ల కేవలం 78 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. రెండు గుడ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఉడకబెట్టిన గుడ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
గ్యాస్
సాధారణంగా చాలా మందికి అజీర్ణం వల్ల గ్యాస్ సమస్య వస్తుంటుంది. అయితే ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటే ఈ సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు.
కంటి చూపు
నిత్యం ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్లలో ఉండే లుటీన్, జియాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును పెంచుతాయి. సూర్య కిరణాల బారి నుంచి కళ్లను సంరక్షిస్తాయి. నిత్యం కోడిగుడ్లను తినడం వల్ల కళ్లలో శుక్లాలు రాకుండా ఉంటాయి.
మెదడు ఆరోగ్యం
కోడిగుడ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ మెదడు కణాల పనితీరు మెరుగుపడేందుకు సహాయ పడతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. నాడులు సక్రమంగా పనిచేస్తాయి. మెదడులో మెటబాలిజం పెరుగుతుంది.
పిండం ఎదుగుదలకు
గర్భిణీలు నిత్యం ఉడకబెట్టిన గుడ్లను తినాలి. దీంతో వారి గర్భంలో ఉండే పిండం సరిగ్గా ఎదుగుతుంది. శిశువు మెదడు అభివృద్ధి చెందుతుంది. పుట్టుకతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.