ఆరోగ్యానికి, అందానికి కొబ్బరినూనె ఎంతో ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. కొబ్బరినూనెలాగే కొబ్బరిపాలు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్రమానికి అనుగుణంగా నీళ్లు కలుపుతూ మెత్తగా పట్టుకోవాలి. తరువాత ఒక పలుచని వస్త్రంలో ఆ మిశ్రమాన్ని వేసి గట్టిగా పిండుకోవాలి. దీంతో కొబ్బరిపాలు వస్తాయి. వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
కొబ్బరిపాలను వాడడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ పాలలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. సాధారణ పాలను తాగలేని వారు కొబ్బరిపాలను తీసుకోవచ్చు. కొబ్బరిపాలు హైబీపీని తగ్గిస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కొబ్బరిపాలలో విటమిన్ సి, బి1, బి3, బి5, బి6, ఐరన్, సెలీనియం, సోడియం, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఈ పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల కొబ్బరిపాలు యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
కొబ్బరిపాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. తల్లిపాలతో సమానమైన పోషకాలు కొబ్బరిపాలలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కనుక ఈ పాలను రోజూ తీసుకోవడం మంచిది.
కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మర్దనా చేసి కొంత సేపటి తరువాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
కొబ్బరిపాలను మొటిమలపై రాసి కొంత సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి. కొబ్బరిపాలను ముఖానికి రాసి కొంత సేపు ఉన్నాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు తొలగిపోతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365