పెరుగంటే చాలా మందికి ఇష్టమే. రోజూ భోజనంలో దీన్ని తినకపోతే కొందరికి తోచదు. అసలు పెరుగు లేకుండా కొందరు భోజనం చేయరు. చేసినా భోజనం ముగించిన తృప్తి అనేది ఉండదు. పెరుగు అనేది చాలా మందికి అంతలా ఇష్టంగా మారింది. దీన్ని రోజూ కొందరు స్మూతీలు, జ్యూస్‌లలోనూ కలుపుకుని తాగుతారు. అయితే నిత్యం పెరుగును తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగులో కాల్షియం, విటమిన్ బి, బి12, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే విటమిన్ బి12, రైబోఫ్లేవిన్‌లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. పెరుగులో విటమిన్ డి మనకు సహజసిద్ధంగా లభిస్తుంది. దీని వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది.
పెరుగు ప్రొబయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతుంది. అంటే ఇందులో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే బాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ బాక్టీరియా జీర్ణవ్యవస్థలోని చెడు బాక్టీరియాతో పోరాడుతుంది. జీర్ణ వ్యవస్థకు రక్షణ లభిస్తుంది. ఆ వ్యవస్థకు చెందిన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, ఐబీఎస్ వంటి సమస్యలు రావు.
పెరుగు ద్వారా మనకు ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. 200 గ్రాముల పెరుగులో 12 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల శక్తి అందుతుంది. రోజంతా పనిచేసినా అలసట అనిపించదు. పైగా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో బరువు తగ్గవచ్చు.
రోజుకు కనీసం 200 గ్రాముల మేర పెరుగు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని ఆస్ట్రియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వియన్నా సైంటిస్టులు తెలిపారు.
పెరుగులో పొటాషియం, మెగ్నిషియంలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
మహిళలు నిత్యం పెరుగును తీసుకుంటే వారిలో ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పెరుగులో ఉండే మంచి బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను రాకుండా చూస్తుంది.
పెరుగులో ఉండే కాల్షియం దంతాలను దృఢంగా మారుస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
సూచన: ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు లేని పాలతో తయారు చేసిన పెరుగును తినడం శ్రేయస్కరం. ఆరోగ్యవంతులు ఎలాంటి పెరుగు అయినా తినవచ్చు.