హైబీపీ అనేది ప్రస్తుతం చాలా మందికి ఇబ్బందిగా మారింది. హైబీపీ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. హైబీపీ ఉన్నవారు డాక్టర్ సూచించిన మేర నిత్యం మందులను వాడడంతోపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే రోజూ పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అయితే హైబీపీ ఉన్నవారు ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోరాదు. తీసుకుంటే సమస్య ఎక్కువవుతుంది. కనుక వాటికి దూరంగా ఉండాలి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఉప్పు
హైబీపీ ఉన్నవారు ఉప్పును తక్కువగా తినాలి. నిత్యం తినే ఉప్పులో కొద్ది శాతం తక్కువగా తీసుకుంటే చాలు, ఎంతో మెరుగైన ఫలితం ఉంటుంది. బీపీ సుమారుగా 5 నుంచి 6 ఎంఎం హెచ్‌జీ మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఉప్పును తక్కువగా తీసుకోవడంతోపాటు ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించాలి. దీంతో కేవలం ఒక్క వారంలోనే తేడా గమనిస్తారు. బీపీ గణనీయంగా తగ్గుతుంది. అదుపులోకి వస్తుంది.
2. కాఫీ
హైబీపీ ఉన్నవారు కాఫీ తాగడం తగ్గించాలి. కాఫీ తాగడం వల్ల అందులో ఎక్కువగా ఉండే కెఫీన్ బీపీని కొంత సేపు పెంచుతుంది. బీపీ ఉన్నవారికి ఇది మంచిది కాదు. సాధారణ వ్యక్తులకు ఏమీ కాదు. కానీ బీపీ ఉన్నవారు మాత్రం కాఫీ తాగడాన్ని తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది.
3. ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రాజెన్ ఫుడ్స్, పిజ్జాలు
ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రాజెన్ ఫుడ్స్, పిజ్జాలు శరీరానికి ఏమాత్రం మంచివి కావు. ఆరోగ్య వంతులు అయినా సరే వీటిని ఎక్కువగా తీసుకోరాదు. ఇక బీపీ ఉన్నవారు అయితే వీటిని అస్సలు తినరాదు. వీటిల్లో చక్కెర, శాచురేటెడ్ ఫ్యాట్, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని పెంచుతాయి. అందువల్ల ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి.
4. ట్రాన్స్ ఫ్యాట్స్
కుకీస్, కేక్స్, పై, డో నట్స్, క్రాకర్స్, మైక్రోవేవ్ పాప్ కార్న్ వంటి బేకరీ ఉత్పత్తులను తినరాదు. వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కృత్రిమ కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి శరీరానికి ఏమాత్రం మంచివి కావు. ఇవి చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో బీపీ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలను కూడా బీపీ ఎక్కువగా ఉన్నవారు మానేయాల్సి ఉంటుంది.
5. ధూమపానం, మద్యపానం
బీపీ సమస్య ఉన్న వారు మద్య పానం, ధూమపానంలకు దూరంగా ఉండాలి. పొగ తాగడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదే మద్యం సేవిస్తే సహజంగానే బీపీ పెరుగుతుంది. అందువల్ల ఈ రెండింటినీ మానేయాలి. దీంతో బీపీ ఆటోమేటిగ్గా అదుపులోకి వస్తుంది. బీపీ సమస్య తగ్గుతుంది.
ఈ సూచనలు పాటించడం వల్ల బీపీని సులభంగా అదుపులోకి తేవచ్చు. ఇక బీపీ ఉన్నవారు నిత్యం ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న పాలు, పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, చేపలు, కోడిగుడ్లలో తెల్లని సొన, నట్స్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. ఇలా కూడా బీపీని అదుపులోకి తేవచ్చు.