Hing Benefits : ఇంగువ.. దాదాపు ఇది తెలియని వారుండరనే చెప్పవచ్చు. ఎంతో కాలంగా ఇంగువను మనం వంటలల్లో అలాగే ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉన్నాము. ఆయుర్వేదంలో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో దీనిని ఔషధంగా వాడతారు. అలాగే వంటలల్లో దీనిని వేయడం వల్ల చక్కటి వాసనతో రుచి కూడా పెరుగుతుంది. దీనిని హింగ్, ఆసఫోటిడా అని కూడా పిలుస్తారు. ఇంగువను ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంగువను వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇంగువ మనకు ఎంతో సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.పొట్టలో అసౌకర్యం తగ్గుతుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇంగువ యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. శరీరంలో మంట, ఉబ్బసం, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఇంగువను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంగువను తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంగువ అనాల్జేసిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని తరుచూ తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఇక ఇంగువ యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇంగువ మనకు సహాయపడుతుంది. తామర, గజ్జి, మొటిమలు వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో ఇంగువను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ఇంగువను తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఇంగువ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, దీనిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని మితంగా తీసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.