Garlic : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం.. రోజూ వెల్లుల్లిని పచ్చిగా తింటేనే మంచిదట. దీంతోనే ఎక్కువ లాభాలను పొందవచ్చని చెబుతున్నారు.
వెల్లుల్లి అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడానికి దానిని పచ్చిగానే తినాలి. అయితే పచ్చిగా తింటే నోట్లో మంట కలుగుతుంది. అందువల్ల దీన్ని నేరుగా తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే వెల్లుల్లిని ఎలాంటి మంట కలగకుండా తినవచ్చు. అందుకు గాను వెల్లుల్లి రెబ్బలను రెండు తీసుకుని ముందుగా బాగా నలపాలి. లేదా దంచాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఆ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి తినేయాలి. ఇలా తింటే వెల్లుల్లి వల్ల నోట్లో అసలు మంట కలగదు.
ఇక వెల్లుల్లిని 10 నిమిషాల పాటు ఉంచడం వల్ల అందులో ఆల్లిసిన్ అనే సమ్మేళనం తయారవుతుంది. ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆల్లిసిన్ వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు.
ఇక వెల్లుల్లిని ఇలా తినడం వల్ల అనేక బాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. వాటి వల్ల వచ్చే జ్వరాలు కూడా తగ్గుతాయి. రోజూ పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను దంచి అందులో తేనె కలిపి తింటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.