Pani Puri : పానీ పూరీ.. మన దేశంలో ఎంతో మందికి ఫేవరెట్ ఫుడ్ ఇది. బయటకు వెళ్లగానే మనకు రహదారుల పక్కన నోరూరించేలా పానీ పూరీ బండ్లు దర్శనం ఇస్తుంటాయి. ఇంకేముంది.. మనం వెంటనే వాటని నోట్లో వేసుకుని వాటి రుచిని ఆస్వాదిస్తాం. అయితే తాజాగా వచ్చిన సమాచారం గురించి మీరు తెలుసుకుంటే ఇకపై మీరు పానీ పూరీ తినాలంటేనే జంకుతారు. అవును, విషయం అలాంటిది మరి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీ పూరీ విక్రయశాలలపై దాడులు చేపట్టారు. అనంతరం వాటిల్లో విక్రయిస్తున్న పానీపూరీలకు చెందిన శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం 260 శాంపిల్స్ సేకరించగా వాటిల్లో 22 శాతం వరకు శాంపిల్స్ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల విషయంలో ఫెయిల్ అయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు. మొత్తం శాంపిల్స్ మీద 41 శాంపిల్స్ లో కృత్రిమ రంగులు, హానికర రసాయనాలను కలిపినట్లు నిర్దారించారు. అలాగే మరో 18 శాంపిల్స్ అసలు తినేందుకు ఏమాత్రం పనికిరావని నిర్దారించారు. దీంతో పానీ పూరీ తింటున్న వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలోనే పానీ పూరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కృత్రిమ రంగులు, హానికర రసాయనాలను కలిపి తయారు చేసిన పానీ పూరీని తినకూడదని అంటున్నారు. అలాగే పానీ పూరీ విక్రయశాలల వద్ద స్వచ్ఛత లేనట్లయితే అలాంటి చోట్ల కూడా తినకూడదని అంటున్నారు. ఒకవేళ అలాంటి ప్రదేశాల్లో తింటే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందని, తరువాత విరేచనాలు మొదలై ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అలాగే రసాయనాలు కలిపి తయారు చేసిన పానీ పూరీలను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. పానీ పూరీల్లో ఎలాంటి పోషకాలు ఉండవు సరికదా.. వాటిల్లో అధికంగా ఉండే సోడియం వల్ల కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. పానీ పూరీలను తినడం మంచిది కాదని, అంతగా తినాలనిపిస్తే వాటిని ఇంట్లోనే తయారు చేసి తినడం ఉత్తమం అని సూచిస్తున్నారు.