Peanuts : మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో పల్లీలు కూడా ఒకటి. పల్లీలల్లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే పల్లీలల్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే మైక్రో న్యూట్రియన్స్ కండరాలను, ఎముకలను, కణాలను ఆరోగ్యంగా, ధృడంగా ఉంచడంలో దోహదపడతాయి. 28 గ్రాముల పల్లీలల్లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఒక గ్లాస్ పాలల్లో ఉండే ప్రోటీన్ తో సమానం. రోజూ పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ పల్లీలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పల్లీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు పల్లీలను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్, అలాగే మేలు చేసే కొవ్వులు డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి. అదే విధంగా పల్లీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పల్లీలు మనకు ఎంతో దోహదపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా కాపాడడంతో సహాయపడతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు పల్లీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పల్లీలల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
దీంతో మనకు త్వరగా ఆకలి వేయకుండా ఉండడంతో పాటు ఇతర చిరుతిళ్లను తినకుండా ఉంటాము. బరువు తగ్గాలనుకునే వారు పల్లీలను స్నాక్స్ గా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. పల్లీలల్లో విటమిన్ బి3 ( నియాసిన్ ) ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జ్ఞాపక శక్తిని పెంచడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ఇక పల్లీలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి ఆరోగ్యకరమైన కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా చేయడంలో ఉపయోగపడతాయి.
అంతేకాకుండా పల్లీలను తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. వీటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. చర్మంపై ముడతలు రాకుండా చేసి చర్యాన్ని అందంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో పల్లీలు మనకు ఎంతో సహాయపడతాయి. అలాగే పల్లీలను తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను, నాణ్యతను పెంచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. ఈవిధంగా పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.