Potato Skin : ఆలుగడ్డలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం. వీటితో అనేక రకాల వంటలను చేసుకుని తింటుంటారు. ఆలుగడ్డల వేపుడు, పులుసు, టమటా కర్రీ, చిప్స్.. ఇలా ఏది చేసినా ఆలుగడ్డలతో వండే వంటకాలు అందరికీ నచ్చుతాయి. అయితే చాలా మంది ఆలుగడ్డలకు ఉండే పొట్టును తీసేసి వండుతుంటారు. కానీ వాస్తవానికి ఆలుగడ్డల పొట్టును పడేయరాదు. ఆ పొట్టులో ఎన్నో విలువైన పోషకాలు, సమ్మేళనాలు ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆలుగడ్డల పొట్టులో అత్యంత విలువైన పోషకాలు ఉంటాయి. రష్యా, బల్గేరియా, ఈక్వెడార్ వంటి కొన్ని దేశాల వారు ఆలుగడ్డలను పొట్టుతో సహా తింటారు. దీంతో ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని వారు విశ్వసిస్తారు. ఆలుగడ్డలను పొట్టుతో సహా తినడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని.. ఎక్కువ కాలం జీవించవచ్చని వారు విశ్వసిస్తారు. అందుకనే వారు వాటిని పొట్టుతో సహా తింటుంటారు.
ఇక ఆలుగడ్డల పొట్టులో విటమిన్లు ఎ, సి, బి, ఫైబర్, పాంటోథెనిక్ యాసిడ్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఆలుగడ్డల పొట్టులో క్యారెట్లలో కన్నా అధికంగా విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లో శుక్లాలు రాకుండా చూస్తుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే విటమిన్ సి కూడా అధికంగానే లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను రాకుండా చూస్తుంది.
ఆలుగడ్డలను పొట్టుతో సహా తింటే ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీని వల్ల అధిక బరువు తగ్గడంతోపాటు జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం, గ్యాస్ తగ్గుతాయి.
అయిలే ఆలుగడ్డల పొట్టులో సోలనైన్ అనబడే గ్లైకో ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది విష పదార్థం. కానీ ఆలుగడ్డల పొట్టులో ఇది చాలా సూక్ష్మమైన మోతాదులో ఉంటుంది. కనుక ఆలుగడ్డల పొట్టును తినవచ్చు. దాంతో ఏమీ కాదు. ఈ విష పదార్థం మనపై హానికర ప్రభావాన్ని చూపించాలంటే మనం 15 కిలోల ఆలుగడ్డల పొట్టును ఒకేసారి తినాల్సి ఉంటుంది. కానీ మనం చాలా తక్కువ తింటాం. కనుక ఆ సమ్మేళనం ప్రభావం మనపై పడదు. కాబట్టి ఆలుగడ్డల పొట్టును నిరభ్యంతరంగా తినవచ్చు. భయపడాల్సి పనిలేదు. దాంతో ఏమీ కాదు..!