Fever : అసలే ఇది వ్యాధుల సీజన్. విష జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు ఈ సీజన్‌లో ఎక్కువగా వస్తుంటాయి. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడితే.. హాస్పిటల్‌కు వెళితే వైద్యులు మనకు ఆ సమస్య తగ్గేందుకు పలు మెడిసిన్లను రాస్తుంటారు. వాటిల్లో యాంటీ బయోటిక్స్ కూడా సహజంగానే ఉంటాయి. వాటితో మన శరీరంలో ఉండే బాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దీంతో అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే వాటితోపాటు మన ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే కింద తెలిపిన నేచురల్ యాంటీ బయోటిక్ పదార్థాలను కూడా వాడితే అనారోగ్య సమస్యల నుంచి ఇంకా త్వరగా కోలుకుని, పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఆయుర్వేద ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. అంతేకాదు మన శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తేనెకు ఉంటుంది. అందుకని ఇది సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. నిత్యం తేనెను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు.. మన శరీరంలో ఉండే క్రిములు నశిస్తాయి. అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గుతాయి. అలాగే గాయాలు, పుండ్లపై కూడా తేనెను రాస్తే అవి త్వరగా తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్లు త్వరగా నయమవుతాయి. అయితే చక్కెరకు బదులుగా తేనెను వాడితే ఇంకా మెరుగైన ఫలితం ఉంటుంది. కనీసం ఒక టీస్పూన్ తేనెను నిత్యం నేరుగా తీసుకున్నా చాలు.. అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. తేనెలాగే వెల్లుల్లి కూడా సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌లా పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ అనే సమ్మేళనం మన శరీరంలో ఉండే హానికారక బాక్టీరియాను నాశనం చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు రెండింటిని నిత్యం రెండు పూటలా నేరుగా తిన్నా లేదా వాటిని నూనెలో రోస్ట్ చేసుకుని తిన్నా ఫలితం ఉంటుంది.
అల్లంలో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో ఉండే జింజెరాల్ అనబడే సమ్మేళనం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది వికారాన్ని తగ్గిస్తుంది. కండరాల నొప్పులను పోగొడుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. వ్యాధులు త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. పసుపులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే కర్‌క్యుమిన్ అనబడే పదార్థం సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. అందువల్ల నిత్యం పసుపును తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలను త్వరగా తగ్గించుకోవచ్చు.