Jeelakarra Sompu Kashayam : ఒక చక్కటి చిట్కాను ఉపయోగించి మనం మన జీర్ణ సంబంధిత సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల కడుపులో మంట, గొంతులో మంట, గ్యాస్, మలబద్దకం, త్రేన్పులు ఎక్కువగా రావడం, అజీర్తి వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల అరికాళ్లు, అరిచేతుల్లో మంటలతో పాటు సూదులు గుచ్చినట్టు ఉండడం, కళ్లల్లో మంటలు, తలనొప్పి, నోటిలో అల్సర్లు వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. మన జీర్ణసమస్యలన్నింటిని దూరం చేసే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం సోంపు గింజలను ఉపయోగించాల్సి ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరచడంలో సోంపు ఎంతో సహాయపడుతుంది.
అలాగే మనం ఉపయోగించాల్సిన రెండో పదార్థం జీలకర్ర. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో జీలకర్ర ఎంతో దోహదపడుతుంది. అలాగే మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం ధనియాలు. శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ధనియాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ మూడు పదార్థాలను ఉపయోగించి కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల మనం జీర్ణ సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు వేసి కలపాలి.
ఈ దినుసులను రాత్రంతా నానబెట్టిన తరువాత ఉదయాన్నే ఈ నీటిని 2 నిమిషాల పాటు మరిగించి వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయి. ఆకలి పెరుగుతుంది. ఈ కషాయాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులో రుచి కొరకు నల్ల ఉప్పు లేదా తేనెను కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కళ్లల్లో మంటలు తగ్గుతాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. అరి చేతులు, అరికాళ్ల మంటలు తగ్గుతాయి. శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ విధంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల జీర్ణ సమస్యలను మన దరి చేరుకుండా చూసుకోవచ్చు.