మన శరీరంలో అనేక రకాల పనులు సక్రమంగా జరగాలంటే అందుకు లివర్ ఎంతగానో అవసరం. జీవక్రియలకు, రోగ నిరోధక శక్తికి, జీర్ణక్రియకు, విష పదార్థాలను బయటకు పంపేందుకు, పోషకాలను నిల్వ చేసుకునేందుకు.. ఇలా సుమారుగా 500కు పైగా పనులను లివర్ నిర్వర్తిస్తుంది. అందువల్ల మన శరీరంలో లివర్ ఒక ప్రధాన అవయవంగా ఉంది.
లివర్ ఆరోగ్యంగా లేకపోతే హెపటైటిస్, ఫ్యాటీ లివర్, సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక హెపటైటిస్ 7 రకాలుగా ఉంటుంది. వాటిని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి లుగా గుర్తించారు. వీటిల్లో హెపటైటిస్ ఎ, ఇ, ఎఫ్ వైరస్‌లు కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్యాపిస్తాయి. బి, సి, డి, జి వైరస్‌లు ప్రధానంగా రక్తం లేదా శారీరక ద్రవాల ద్వారా వ్యాపిస్తాయి. లైంగిక సంపర్కం లేదా కలుషితమైన రక్తం వల్ల కూడా వస్తాయి.
ఇక ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కూడా ఉంది. ఇది మందులు, టాక్సిన్స్, ఆల్కహాల్ వల్ల వస్తుంది. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది మీ శరీరం మీ సొంత కాలేయ కణజాలానికి వ్యతిరేకంగా యాంటీ బాడీలను తయారు చేసి దానిపై దాడి చేసినప్పుడు సంభవించే ఒక వ్యాధి.
హెపటైటిస్ వైరస్ బారిన పడిన చాలా మందికి తమకు ఆ వైరస్ ఉన్నట్లు తెలియదు. ఎటువంటి లక్షణాలు కనిపించవు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ తరువాత లక్షణాలు కనిపిస్తాయి. అవి 2 వారాల నుండి 6 నెలల మధ్య ఎప్పుడైనా కనిపిస్తాయి. దీర్ఘకాలిక వైరల్ హెపటైటిస్ లక్షణాలు వృద్ధి చెందడానికి దశాబ్దాలు పడుతుంది. జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కడుపు నొప్పి, ముదురు రంగులో మూత్రం, లేత రంగు మలం, కామెర్లు, కీళ్ల నొప్పులు హెపటైటిస్ సాధారణ లక్షణాలు. హెపటైటిస్ వ్యాధికి చికిత్స అందించేందుకు రోగ నిర్ధారణ అవసరం.
మీ కాలేయం ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తారు. లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, అబ్డోమినల్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (సీటీ) స్కానింగ్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ), ఫైబ్రోస్కాన్ వంటి టెస్టులు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఫలితాలు రాకపోతే వైద్యులు కాలేయ బయాప్సీని చేయించుకోమని చెబుతారు. దీంతో వ్యాధిని నిర్దారిస్తారు.
లివర్‌కు ఏ వ్యాధి వచ్చినా అది సాధారణమే అయితే వైద్యుల సలహా మేరకు మందులను వాడుకుంటే సరిపోతుంది. దీంతోపాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి.
లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ క్యారెట్ లేదా బీట్‌రూట్ జ్యూస్ తాగవచ్చు. ఓట్‌మీల్, కాఫీ, గ్రీన్ టీ, వెల్లుల్లి, ద్రాక్షలు, అరటి పండ్లు, బార్లీ, బ్రౌన్ రైస్, అంజీర్ పండ్లు, నిమ్మకాయలు, బొప్పాయి, పుచ్చకాయలు తదితర ఆహారాలను రోజూ తీసుకుంటే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఆయుర్వేదం ప్రకారం లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పలు మూలికలు పనిచేస్తాయి. కలబంద గుజ్జు, వేపాకులు, కాకరకాయ, ఉసిరికాయ, పసుపు, పునర్నవ, అశ్వగంధ, వాము, శంఖపుష్పి, బ్రాహ్మి, పుదీనా, సోంపు గింజలను వాడుకోవచ్చు. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.