ప్రతి సంవత్సరం భారతదేశంలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (ఎస్సీఏ) వల్ల లక్ష మందిలో 4,280 మంది మరణిస్తున్నారు. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని పంపింగ్ చేసే పనిని ఆపివేస్తుంది. ఇది హృదయ స్పందన, శ్వాసను నిలిపివేస్తుంది. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ అనే పదాలను తరచూ మనం వింటుంటాం. అయితే ఇవి రెండూ వేర్వేరు పరిస్థితులు.
కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డు పడడం కారణంగా ధమనిలో నిరోధం వచ్చినప్పుడు గుండె కండరానికి రక్తం రాకుండా గుండెపోటు సంభవిస్తుంది. దీనివల్ల తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. గుండె విద్యుత్ కార్యకలాపాలలో భంగం కారణంగా కార్డియాక్ అరెస్ట్ అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఇది క్రమరహిత హృదయ స్పందన (అరిథ్మియా) కు కారణమవుతుంది. ఇది మెదడు, ఊపిరితిత్తులు, ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కార్డియాక్ అరెస్టుకు దారితీసే గుండె విద్యుత్ కార్యకలాపాలలో భంగం కింది కారణాల వల్ల ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది.
మధుమేహం, రక్తపోటు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధుల కారణంగా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. అయితే ఇది ఏ సమయంలోనైనా ఎవరికైనా సంభవిస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. దీంతో బాధితుడికి చికిత్స చేయకపోతే నిమిషాల్లోనే మరణం సంభవిస్తుంది. కార్డియాక్ అరెస్ట్ బాధితుడి విషయంలో చికిత్సను ఆలస్యం చేసేకొద్దీ ప్రతి నిమిషానికి 7-10 శాతం జీవించే అవకాశాలు తగ్గుతుంటాయి. కాబట్టి సత్వరమే స్పందించి చికిత్సను అందించాల్సి ఉంటుంది. దీంతో కార్డియాక్ అరెస్ట్ అయిన వారిని రక్షించవచ్చు.
కార్డియాక్ అరెస్ట్ అయిన వారికి Cardio Pulmonary Resuscitation (CPR) ఇవ్వడం వల్ల కాపాడుకోవచ్చు. అందుకుగాను కింద తెలిపిన విధంగా సూచనలు పాటించాలి.
* కార్డియాక్ అరెస్ట్ లేదా గుండె పోటు వచ్చిన వారిని నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి.
* రెండు చేతుల్తో ఛాతి మధ్యలో 30 సార్లు అదమాలి. తరువాత 2 సార్లు నోటితో శ్వాస ఇవ్వాలి. ఇలా రోగికి స్పృహ వచ్చే వరకు చేయాలి.
* చిన్నారులకు అయితే ఛాతి మధ్యలో ఒక చేతితో అదిమితే చాలు. అదే శిశువులకు అయితే ఛాతి మధ్యలో రెండు వేళ్లతో అదమాలి.
సీపీఆర్ అంటే ఏమీ లేదు, కార్డియాక్ అరెస్ట్ లేదా గుండె పోటు వల్ల శరీర భాగాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. సీపీఆర్ చేయడం వల్ల రక్త సరఫరా ప్రారంభమవుతుంది. మెదడుకు కూడా రక్త సరఫరా జరుగుతుంది. దీంతో బాధితుడు స్పృహలోకి వస్తాడు. ప్రాణాపాయం తప్పుతుంది. సీపీఆర్ చేయడం వల్ల ఇలాంటి స్థితిలో ఉన్న చాలా మందిని రక్షించుకోవచ్చు. ఛాతిపై అదమడంతోపాటు నోట్లో నోరు పెట్టి శ్వాస అందిస్తేనే సీపీఆర్ పూర్తి చేసినట్లు లెక్క.