Skin Problems: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందేలా చూసుకోవాలి. ఒక్కో విటమిన్ మనకు ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల విటమిన్లు కలిపి ఒక్కో అవయవానికి మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చర్మ సంరక్షణకు కూడా కొన్ని విటమిన్లు అవసరం అవుతుంటాయి. ఆ విటమిన్లు లోపిస్తే చర్మ సమస్యలు వస్తాయి.
విటమిన్లు లోపించడంవల్ల చర్మం డల్‌గా మారుతుంది. పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. చర్మం పొడిగా మారుతుంది. నూనె ఎక్కువగా స్రవించి జిడ్డుగా కనిపిస్తుంది. అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే చర్మాన్ని సంరక్షించే విటమిన్లను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ ఇ లోపం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మం పొడిబారుతుంది. ముడతలు పడతాయి. యవ్వనంలో ఉన్నా వృద్ధాప్యం వచ్చిన వారిలా ముడతలు ఏర్పడతాయి. అందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు విటమిన్ ఇ అందేలా చూసుకోవాలి. విటమిన్ ఇ వల్ల చర్మం సూర్య కిరణాల బారి నుంచి సురక్షితంగా ఉంటుంది. చర్మం ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంటుంది. విటమిన్ ఇ మనకు అన్ని రకాల ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలతోపాటు బొప్పాయి, నట్స్, డ్రై ఫ్రూట్స్, విత్తనాల్లో లభిస్తుంది.
విటమిన్ డి స్థాయిలు తక్కువ ఉంటే ఎముకలపై ప్రభావం పడడమే కాదు, అది చర్మంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మం పొడిగా మారుతుంది. సోరియాసిస్, అటోపిక్ డెర్మటైటిస్ వంటి సమస్యలు వస్తాయి. కనుక విటమిన్ డి తగినంత అందేలా చూసుకోవాలి. విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అలాగే నారింజ పండ్ల జ్యూస్, ఓట్ మీల్, తృణ ధాన్యాలు, సోయా మిల్క్, ఆవు పాలు, చేపలు, పుట్ట గొడుగులు, కోడిగుడ్డులోని పచ్చని సొన ద్వారా లభిస్తుంది.
విటమిన్ కె లెవల్స్ తక్కువగా ఉంటే డార్క్ స్పాట్స్, మచ్చలు, కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. చర్మంపై గాయాలు అయినా, వాపులు వచ్చినా త్వరగా మానవు. ఇలా ఉంటే విటమిన్ కె తగ్గిందని అర్థం చేసుకోవాలి. దీంతో విటమిన్ కె ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ కె మనకు పాలకూర, నట్స్, యాప్రికాట్స్, చేపలు, అవకాడో, టమాటాలు, గుమ్మడికాయలు, పచ్చి బఠానీల్లో ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్ సి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి లోపిస్తే చర్మం పొడిగా మారుతుంది. వాపులకు గురవుతుంది. ముడతలు పడతాయి. వయస్సు అయిపోయిన వారిలా కనిపిస్తారు. విటమిన్ సి ఎక్కువగా సిట్రస్ జాతి పండ్లైన నారింజ, కివీలు, నిమ్మ, స్ట్రాబెర్రీలు వంటి ఆహారాల్లో లభిస్తుంది.
బి విటమిన్ల లోపాలు ఉంటే చర్మంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. దురదలు ఏర్పడుతాయి. చర్మం పొడిగా మారి పొలుసులుగా ఊడి వస్తుంది. పెదవులు పగులుతాయి. ముఖంపై ముడతలు ఏర్పడుతాయి. కాబట్టి బి విటమిన్లు కూడా అందేలా చూసుకోవాలి. దీంతో చర్మ సమస్యలు రావు. ఈ విటమిన్లు మనకు ఎక్కువగా చేపలు, నట్స్, అవకాడో, అరటి పండ్లు, తృణ ధాన్యాలు, పాలకూర, కోడిగుడ్లు, మటన్ వంటి ఆహారాల్లో లభిస్తాయి. వీటిని తరచూ తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.