Garlic : మనం ఎంతో కాలం నుంచి వెల్లుల్లిని వంటల్లో ఉపయోగిస్తున్నాం. వెల్లుల్లిని వేస్తే వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. వీటిని ఎక్కువగా నాన్ వెజ్ వంటలతోపాటు వెజ్ మసాలా వంటల్లో వేస్తుంటారు. వెల్లుల్లిని కొందరు రోజూ వాడుతుంటారు కూడా. అయితే వెల్లుల్లిని తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి తేనెతో కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వెల్లుల్లి మనకు ఆరోగ్యకరమే అయినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వెల్లుల్లిని తినరాదు. తింటే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. వెల్లుల్లిని ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్, కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు లేదా ఆ సమస్యలకు మందులను వాడుతున్నవారు వెల్లుల్లిని తినరాదు. తింటే సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కనుక ఈ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అలాగే కొందరికి జీర్ణాశయ గోడలు సున్నితంగా ఉంటాయి. వీరు ఘాటైన ఆహారాలను తినలేరు. ఇలాంటి వారు కూడా వెల్లుల్లికి దూరంగా ఉండాలి. దీంతోపాటు శరీరం దుర్వాసన వచ్చే వారు కూడా వెల్లుల్లిని తినరాదు. కొందరికి చెమట వల్ల ఎప్పుడూ శరీరం దుర్వాసన వస్తుంటుంది. వీరు వెల్లుల్లిని తింటే వాసన మరింత ఎక్కువవుతుంది. కనుక వీరు కూడా వెల్లుల్లిని తీసుకోరాదు.
రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. లేదంటే రక్తస్రావ సమస్య వస్తుంది. రక్తం అధికంగా పోతుంది. ఇక రెండు వారాల్లోగా సర్జరీ చేయించుకోబోతున్నవారు.. సర్జరీ చేసుకుని రెండు వారాలు పూర్తి కానివారు.. వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అలాగే ఫుడ్ అలర్జీలు ఉన్నవారు కూడా వెల్లుల్లిని తినరాదు. ఇలా ఆయా సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తీసుకోకపోవడమే మంచిది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.